బీసిసిఐవర్కింగ్‌ కమిటీ విూటింగ్‌ రద్దు

 

న్యూఢిల్లీ,ఆగష్ట్‌ 2 :

ఆసక్తి రేకెత్తించిన భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ విూటింగ్‌ రద్దైంది. గందరగోళ పరిస్థితుల మధ్య మొదలైన సమావేశంలో ఏం జరుగుతుందో అని ఉత్కంఠగా ఎదురుచూసిన విూడియాకు నిరాశే మిగిలింది. బీసిసిఐ ప్రెసిడెంట్‌గా మళ్ళీ శ్రీనివాసన్‌ బాధ్యతలు స్వీకరించడంపై ఈ విూటింగ్‌లో పెద్ద దుమారమే చెలరేగింది. చాలా మంది సభ్యులు ఆయన రాకను వ్యతిరేకించడంతో గందరగోళం నెలకొంది. శ్రీనివాసన్‌ అధ్యక్షతన సమావేశం జరిగితే కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని , లేనిపోని ఇబ్బందులు వస్తాయని కొందరు వాదించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న బోర్డు పెద్దలు సమావేశాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మరికొంతకాలం జగ్మోహన్‌దాల్మియానే అధ్యక్షునిగా కొనసాగనున్నాడు.

ఇదిలా ఉంటే బాంబే హైకోర్ట్‌ తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలని బీసిసిఐ నిర్ణయించింది. నిజానికి తన అధ్యక్షతనే సమావేశం జరిపి , స్పాట్‌ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చిన గురునాథ్‌,రాజ్‌కుంద్రాలకు మరోసారి బోర్డ్‌ తరపున క్లీన్‌చిట్‌ ఇవ్వాలని శ్రీనివాసన్‌ వ్యూహం రచించినట్టు సమాచారం. అయితే ఇప్పటికే పలు కేసులలో కోర్టులచే చివాట్లు తిన్న నేపథ్యంలో శ్రీనివాసన్‌ను మరికొంతకాలం దూరంగా ఉంచాలని బోర్డు సభ్యుల్లో అత్యధిక శాతం మంది స్పష్టం చేశారు. దీంతో అతను వెనక్కి తగ్గక తప్పలేదు.