క్లీన్‌స్వీప్‌కు అడుగుదూరంలో…

జింబాబ్వేతో ఐదో వన్డేకు భారత్‌ రెడీ

బులావాయో ,ఆగష్ట్‌ 2 :

ఏకపక్షంగా సాగుతోన్న జింబాబ్వే పర్యటనలో భారత జట్టు చివరి మ్యాచ్‌కు సిధ్ధమైంది. 4-0 ఆధిక్యంలో ఉన్న యువభారత్‌ శనివారం ఆఖరి వన్డే ఆడనుంది. అన్ని మ్యాచ్‌లలోనూ ఆతిథ్య జట్టుపై పూర్తి ఆధిపత్యం కనబరిచిన కోహ్లీ సేన ఇక మిగిలిన వైట్‌వాష్‌ టార్గెట్‌ను కూడా పూర్తి చేయాలని భావిస్తోంది. నాలుగు వన్డేల్లోనూ యంగ్‌ ఇండియా అదరగొట్టింది. సీనియర్లు విశ్రాంతి తీసుకోగా….కోహ్లీ సారథ్యంలోని యువ ఆటగాళ్ళం దరూ చక్కని ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. శిఖర్‌ ధావన్‌ , అంబటి రాయుడు , అమిత్‌మిశ్రా , కోహ్లీ తొలి మూడు మ్యాచ్‌ల్లోనూ మెరిసారు. ఇప్పటికే సిరీస్‌ గెలుచుకోవడంతో నాలుగో వన్డేలో రిజర్వ్‌ ఆటగాళ్ళకు చోటు దక్కింది. భారత యువబౌలర్లు సమిష్టిగా రాణించి ఆతిథ్య జట్టును 144 పరుగులకే ఆలౌట్‌ చేశారు. ముఖ్యంగా వన్డే కెరీర్‌ అరంగేట్రం చేసిన మొహిత్‌శర్మ 10 ఓవర్లలో 26 పరుగులకు 2 వికెట్లు పడగొట్టి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందుకున్నాడు. దీంతో ఐదో మ్యాచ్‌లో కూడా రిజర్వ్‌ ప్లేయర్స్‌పైనే అందరి దృష్టీ ఉంది. జమ్మూ కాశ్మీర్‌ నుండి జాతీయ జట్టుకు ఎంపికైన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కిన పర్వేజ్‌ రసూల్‌ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. చివరి మ్యాచ్‌ కావడంతో రసూల్‌కు చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో ఓపెనర్‌ రోహిత్‌శర్మ , సురేష్‌ రైనా కూడా గాడినపడ్డారు.ఏ విధంగా చూసినా సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం భారత్‌కు చాలా ఈజీగానే కనిపిస్తోంది. మరోవైపు బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో వరుసగా నాలుగు వన్డేల్లోనూ ఓడిన జింబాబ్వే చివరి మ్యాచ్‌లో భారత్‌ను నిలువరించాలని భావిస్తోంది. అయితే వారి బ్యాటింగ్‌ గాడిన పడితే తప్ప ఇది సాధ్యం కాదు. సిరీస్‌లో చిగుంబరా తప్పిస్తే… మిగిలిన వారంతా ఘోరంగా విఫలమయ్యారు. అటు బౌలింగ్‌లో మాత్రం ఆ జట్టు కాస్త పర్వాలేదనిపిస్తోంది. మొత్తం విూద భారత్‌ వైట్‌వాష్‌ను అడ్డుకోవడం జింబాబ్వేకు శక్తికి మించిన పనిగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే కెప్టెన్‌గా కెరీర్‌లో తొలి వన్డే సిరీస్‌ గెలిచిన విరాట్‌కోహ్లీ ఇప్పుడు క్లీన్‌స్వీప్‌ ఘనతను కూడా సొంతం చేసుకోనున్నాడు.