గుర్తుండి పొయ్యేది కవులూ, వాళ్ల చరణాలు

‘అక్షరం రూపం దాల్చిన

ఓ సిరా చుక్క

లక్ష మెదల్లకు కదలిక’

ఈ వాక్యం అక్షరంతో పనిచేసే వ్యక్తులందరికీ వర్తిస్తుంది. రచయితలకి, కవులకి మన సమాజంలో విశిష్ట స్థానం ఉంది. ఇది ఎవరూ కాదనలేని విషయం. ఈ దేశ నాగరికత గురించి, గొప్పదనం గురించి చెప్పేది వాళ్లే. కవిత్వం రాసే వాళ్లని చూసి వీళ్లకు ఏం వస్తుందీ అని చాలా మంది అనుకుంటారు. ధనరుపేణా వాళ్లకి ఏమీరాదు. మరో విధంగా చెప్పాలంటే వున్న డబ్బుని వాళ్లు పోగొట్టుకుంటారు. కానీ కవులకి చరిత్రలో విశిష్ట స్థానం వుంది. ప్రపంచ చరిత్రలో మిగిలేది వాళ్లే. కాదు గుర్తిండిపొయ్యేది వాళ్లే.

ఏ దేశం గురించి మాట్లాడుకున్నా మనకు గుర్తుకు వచ్చేది కవులే. రాజ్యాధినేతలు కాదు. ఇంగ్లండ్‌ గురించి మాట్లాడుకుంటే చాలా మందికి గుర్తుకు వచ్చేది అక్కడి కవులు – మిల్టన్‌, వర్డ్స్‌వర్త్‌, షేక్స్పియర్‌, షెల్లీ, కీట్స్‌ బైరన్‌, కోలిరిడ్జ్‌ ఇలా ఎందరో. అమెరికా గురించి మాట్లాడుకుంటే మనకు ఎక్కువగా గుర్తుకు వచ్చే కవులు – టీఎస్‌ ఈలియట్‌, ఎమర్సన్‌, హెమ్మింగ్‌వే, వాల్ట్స్‌ విట్‌మన్‌లు. మన దేశం గురించి మాట్లాడుకుంటే మనకు గుర్తుకు వచ్చే వ్యక్తులు కవులే – వాల్మీకి, పోతన, వ్యాసుడు, కాసిదాసు, టాగోర్‌ గుర్తొస్తారు. రామాయణం. భారతం, గీతాంజలి గుర్తుకొస్తాయి. ఆ తరువాత రాజ్యాధినేతలు గుర్తుకొస్తారు.

కవులు దేశానికి రక్తనాళాల్లాంటివారు. వాళ్లు ఆనందంగా వుంటే దేశం ఆనందంగా, సుఖంగా వుంటుంది. అంటే దేశంలో ఆనందం వుంటేనే కవులు ఆనందంగా వుంటారు. దేశానికి నాయకులతో పాటు కవుల అవసరం వుంటుంది. కవులు లేని దేశంలో అంధకారం వుంటుంది. నాయకులు, రాజ్యాధినేతలు అందరూ నక్షత్రాల్లాంటి వారు. కవి అనేవాడు సూర్యునిలాంటి వాడు. నక్షత్రాలు ఎన్ని వున్నా వులుతురు రాదు. వెన్నెల వుంటుంది. కానీ కావాల్సిన వెలుతురు వుండదు. కవి అనేవాడు సమాజానికి వెలుతురుని ఇచ్చే సూర్యునిలాంటి వాడు.

కవులనే వాళ్లు జీవితాన్ని అనుభవిస్తారు. కొత్త కోణంలో చూస్తారు. మిగతా వ్యక్తులు జీవితాన్ని అనుభవించరని కాదు. వాళ్లు అనుభవిస్తారు. స్పందిస్తారు కానీ ఆ స్పందనని అందించలేరు. కవులు స్పందిస్తారు. వాళ్లు పొందిన స్పందనని, అనుభవాన్ని ప్రజలకి అందిస్తారు. ప్రకృతిని చూసి పరవశించే వాడు కవి. ప్రశ్నించే వాడు శాస్త్రవేత్త.

కవుల కోణం వేరే విధంగా వుంటుంది. మనకు మామూలుగా కనిపించేది వాళ్లకి అద్భుతంగా కనిపిస్తుంది. వాళ్లు చూసిన విషయాన్ని మనకు అందిస్తారు. రెండు వస్తువులు వున్నాయి అనుకోండి. అవి మనకి మామూలుగా అందరికీ కనిపిస్తాయి. కానీ కవులకి అవి విభిన్నంగా కన్పిస్తాయి. ఆ రెండు వస్తువుల్లో వాళ్లకు పోలికలు కన్పిస్తాయి. అదే సృజనాత్మకత. సృష్టి.

పిల్లలు చిన్నప్పుడు డైరీల్లో లేదా పుస్తకాల్లో పిచ్చిగీతలు గీస్తారు. వారి మాటలని కేసెట్లలో తండ్రులు రికార్డు చేస్తారు. గోడల మీద పిచ్చిరేఖలూ బొమ్మలు గీస్తారు. అవి మామూలు వ్యక్తులకి మామూలు తల్లిదండ్రులకి మామూలుగానే కన్పిస్తాయి. కానీ కవి అయిన తండ్రికి అది విభిన్నంగా కన్పిస్తుంది. ఇలాంటివి చూసిన ఓ కవి ఇలా అంటాడు.

‘ఈ పిచ్చిరేఖల్లో మీకు ఏమీ కన్పించకపోవచ్చు

బొమ్మా కన్పించక పోవచ్చు

బొరుసూ కన్పించక పోవచ్చు

కానీ నాకు మాత్రం

ఈ కాగితంలో

కాగితం పడవ వుంది

కాగితం పడవలో వర్షం వుంది.

వర్షం వెనక ఏమీ ఎరగని బాల్యం వుంది.

ఈ కేసెట్‌లో కేరింతలు వున్నాయి

ఆ కేరింతల్లో గొప్ప సంగీతం వుంది

ఆ సంగీతం వెనక నా భావావేశం వుంది

ఈ చినిగిన డైరీలో

నాకే అర్థమయ్యే అక్షరాలున్నాయి.

అక్షరాల వెనక

అనంతమైన భాష వుంది

భాష వెనక మృదు మధురమైన కవిత్వం వుంది

ఈ రేఖల్లో మీకు కన్పించని

మా పాప వుంది.

ఆమె అద్భుతమైన బోసినవ్వుంది

ఆ బోసినవ్వులో

వూగిపోయ్యే నేనున్నాను.’

రెండు వస్తువులని కవి భిన్నంగా దర్శిస్తాడు. అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతలని పంపించేటప్పుడు కవి చూసిన దృశ్యం భిన్నంగా వుంటుంది. దుష్యంతుడు శకుంతలని తీసుకొని వెళ్తుంటాడు. రథం పరుగెడుతుంది. కణ్వ మహర్షి చెక్కిలి మీద గోరు వెచ్చటి కన్నీరు జారుతూ వుంటుంది. భర్త వెంట వెళ్లాలని శకుంతలకి వుంటుంది. మనస్సు తండ్రి వైపు లాగుతూ వుంటుంది. రథం పైన జెండా కవికి మరో రకంగా దర్శనమిస్తుంది. ఇలా వుంటుంది.

ఆమె భర్తతో ముందుకు సాగుతుంది.

ఆమె మనస్సు జెండాలాగా తండ్రివైపు లాగుతుంది.

జెండాలాగా మనస్సు రెపరెపలాడుతుంది.

కవి కంటికి మామూలు కంటికి కన్పించే భేదం ఇదే. రోడ్డు మనకి మామూలు రోడ్డులాగా కన్పిస్తుంది. కానీ ఓ కవికి అది రకరకాలుగా కన్పిస్తుంది. కర్తసిక్తమై భయపెట్టే దినపత్రికలాగా, నల్లగా మారిన మనిషి రక్తం లాగా, బకాసురుడిలాగా, నాలుక సాచిన రాక్షసిలాగా రోడ్డు కన్పిస్తుంది. ఇంకా ల్యాండ్‌మైన్‌లాగా కనిపిస్తుంది. రోజూ విపరీతంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి కవి అభివ్యక్తీకరణ కవి మాటల్లో…

ఈ విశాలమైన రోడ్డుని చూస్తే

రక్తసిక్తమై భయపెట్టే దినపత్రిక గుర్తుకొస్తుంది నాకు

రోడ్డు మీద ‘డాంబరు’ని చూస్తే

ఎండిపోయి నల్లగా మారిన మనిషి రక్తమే గుర్తొస్తుంది నాకు

కిక్కిరిసి పోయి నడువలేని ఈ రోడ్డుని చూస్తే

శవయాత్రే గుర్తొస్తుంది నాకు

శ్వాసకూడా సరిగ్గా తీయలేని ఈ రోడ్డుని చూస్తే

రక్తదాహంతో ఆయాసపడే బకాసురుడే గుర్తొస్తాడు నాకు

నాకీ రోడ్డు

రాక్షసి సాచిన నాలుకలా కన్పిస్తోంది

నాకీ రోడ్డు నల్లకోటు తొడుక్కున్న న్యాయవాదిలా

కన్పిస్తుంది

ఈ రోడ్డుని ఎవడు కనిపెట్టాడో గానీ

నాకీ రోడ్డు రోజూ పేలుతున్న ల్యాండ్‌మైన్‌లా కన్పిస్తోంది

జాన్‌ డోన్‌ అనే ఇంగ్లిషు కవి తన భార్య గురించి ‘……..’ వృత్తలేఖని అన్న కవిత చెబుతాడు. మామూలు వృత్తలేఖని అతను భార్యాభర్తల రూపంలో దర్శిస్తాడు. అతని భార్య అతన్ని బయటకు వెళ్లొద్దని అంటుంది. అప్పుడు అతను ఇలా అంటాడు. భౌతికంగా విడిపోతానేమో కానీ మానసికంగా నీతో కలిసే వుంటానని చెబుతూ ‘వృత్తలేఖని’ గుర్తుకు తెస్తాడు.

ఒక వృత్తం గీస్తున్నప్పుడు వృత్తలేఖనిలోని ఒక కాలు గుండ్రంగా తిరిగి మరో కాలును కలుస్తుంది. ఈ వృత్తం గీసే క్రమంలో అదిపైన కలిసే వుంటుంది. నేను బయటకు వెళ్లినా మళ్లీ కలుస్తాను. భౌతికంగా దూరంగా వున్న వృత్తలేఖనిపై భాగంలాగా నిన్ను మానసికంగా కలిసే వుంటాను.

పోలీకలు, కోణాలు, చూపు కవులవి విభిన్నంగా వుంటాయి. అవి మన మనస్సుల్ని తాకుతాయి. హత్తుకుపోతాయి.

కవులు ఏం చేస్తారు. కవిత్వం రాస్తారు. డబ్బుల కోసం కాదు. మనస్సు కోసం. అందుకే చిట్ట చివరిగా మిగిలేది కవులే. రాజ్యాధినేతలు కూడా ఏమీ తీసుకొని వెళ్లారు. ఎంతమంది గుర్తున్నారు?

‘పోయిరి పాదుషాలు

పడిపోయినవి సౌదంలెల్ల

మాయమైపోయే సమస్త సంపదలు

పోవుచూ పూచిన పుల్లనైనా కొనిపోయేరా!’

ఇది అప్పుడూ, ఎప్పుడూ. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా ఇదే పరిస్థితి వుంటుంది.