లెక్కతేలుతుంది సమ్మెలో ఉన్నదంతా సీమాంధ్ర ఉద్యోగులే
హైదరాబాద్‌లో మమ్మల్ని రెచ్చగొట్టొద్దు : దేవీప్రసాద్
హైదరాబాద్, ఆగస్టు 12 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు నేటి నుంచి తలపెట్టిన సమ్మెతో తెలంగాణ ప్రాంతంలో ఎంతమంది అక్రమంగా ఉద్యోగాలు పొందారనే లెక్కతేలుతుందని టీఎన్‌జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న సమ్మె అధర్మమని పేర్కొన్నారు. గతంలో తెలంగాణ ఉద్యోగులు సమ్మె చేపట్టినప్పుడు ఎస్మా ప్రయోగించిన ప్రభుత్వం ఇప్పుడెందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సమ్మెలో పాల్గొనే వారంతా ఆంధ్రా ఉద్యోగులేనని ఆయన అన్నారు. అలాంటి వారికి తెలంగాణ ఉండేందుకు స్థానం లేదన్నారు. ఆంధ్రా ఉద్యోగులు సమ్మె చేసినా తాము ప్రభుత్వానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచిన ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.