ప్రభుత్వాలపై ప్రజలు విశ్వాసం కోల్పోతే


ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం
న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి) :
ప్రభుత్వాలపై ప్రజలు విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత 67వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. అంతర్గత భద్రతను పరిరక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సహనానికి కూడా హద్దులు ఉంటాయని పేర్కొన్నారు. పొరుగు దేశాలతో స్నేహసంబంధాలు కలిగి ఉండాలని తాము కోరుకుంటున్నా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తున్నాయని పాకిస్తాన్‌ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా మాట్లాడారు. దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు అవినీతేనన్నారు. సిద్ధాంతాలు, విలువలు పాటిస్తూ గాంధీజీ అడుగుజాడల్లో నడుద్దామని పిలుపునిచ్చారు. ప్రస్తుతం పార్లమెంట్‌, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై ప్రణబ్‌ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు వచ్చే ఎన్నికలు మంచి అవకాశంగా ఆయన పేర్కొన్నారు. బాపూజీ చూపిన బాటలో ముందుకు సాగు జాతి పునర్నిర్మాణానికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. దేశం ఈ 66 ఏళ్లలో శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎంతో పురోగతి సాధించిందని అన్నారు. ప్రభుత్వ పాలన వ్యసవ్థలో వేల్లూనుకుపోయిన అవినీతితో దేశం పెను సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు. జాతి నిర్మాణానికి ప్రతి పౌరుడూ కృషి చేయాలని కోరారు.