ఎవడబ్బా జాగీర్‌ హైదరాబాద్‌ మాదే


వీహెచ్‌పై చెప్పు విసిరితే హైదరాబాద్‌పై విసిరినట్టే
ఈట్‌కా జవాబ్‌ పత్తర్‌సే దేంగే
సీమాంధ్రులపై అంజన్‌కుమార్‌ ఆర్‌ పార్‌
న్యూఢిల్లీ, ఆగస్టు 19 (జనంసాక్షి) :
హైదరాబాద్‌ ముమ్మాటికీ మాదే.. ఎవడబ్బా జాగీర్‌ అనుకుంటున్నారు అంటూ సీమాంధ్రులపై సికింద్రాబాద్‌ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ ఫైరయ్యారు. సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హన్మంతరావుపై చెప్పు విసిరితే హైదరాబాద్‌పై విసిరినట్టేనని ఆయన పేర్కొన్నారు. మీరు ఇటుకలతో కొడితే తాము రాళ్లతో బదులిస్తామని (ఈట్‌కా జవాబ్‌ పత్తర్‌సే దేంగే) హెచ్చరించారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రలో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ నేతలకుగాని, అక్కడ ఉద్యోగ సంఘాలు తెలంగాణావారిపై దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని, ఇది మానవత్వం ఉన్నవ్యక్తులు చేసేదేనా అని ప్రశ్నించారు. సీమాంధ్రలో చేస్తున్న దాడులకు ప్రతిగా హైదరాబాద్‌లో తాము దాడులు చేయలేమా అని ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. తాము ఎదురు తిరిగితే మాత్రం ఒక్క సీమాంధ్ర నేత హైదరాబాద్‌లో బతికి బట్టకట్టలేడని గుర్తుంచుకోవాలన్నారు. కాని తాము వాళ్ల అంతటి నీచమైన వ్యక్తులం కామన్నారు. హైకమాండ్‌ మాటకు తాము కట్టుబడి ఉంటే సీమాంధ్రులు ఎందుకు అలా ఉండడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే ఒప్పుకోమన్నారు. హైదరాబాద్‌ నగరం బడుగు బలహీన వర్గాలకు చెందినదన్నారు. హైదరాబాద్‌కు వచ్చాకే సీమాంధ్రులు అభివృద్ధిలోకి వచ్చారన్నారు. హైదరాబాద్‌కు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. దీనిపై హక్కులు కావాలన్నా, మరోటేదైనా కూడా అంగీకరించే పరిస్థితే లేదన్నారు. సీమాంధ్రులు వచ్చాకే హైదరాబాద్‌లో చేతి వృత్తులకు ఆధరణ లేకుండా పోయిందన్నారు. హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉండి సామరస్యంగా విడిపోయేందుకు సహకరించాలని మరోసారి కోరుతున్నట్లు అంజన్‌కుమార్‌ పేర్కొన్నారు. హైటెక్స్‌లో తనకు సెంటు భూమి ఉన్నట్లు నిరూపించినా పదవి నుంచి తప్పుకుంటానన్నారు. సీమాంధ్ర నేతలు ఒక్కకొక్కరు వేలాది ఎకరాలు కబ్జాకు పాల్పడ్డట్లు నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు పెరిగే అవకాశంఉందన్నారు. ఇప్పటికైనా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండి రాష్ట్ర విభజనకు సహకరించాలని అంజన్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.