జలసౌధ వద్ద సీమాంధ్ర ఉద్యోగుల ఆగడాలు


ఆజ్యం పోసేందుకు తులసీరెడ్డి యత్నం
రెచ్చగొట్టినా సంయమనం పాటించిన తెలంగాణ ఉద్యోగులు
హైదరాబాద్‌, ఆగస్టు 23 (జనంసాక్షి) :
జలసౌధ వద్ద సీమాంధ్ర ఉద్యోగులు రెచ్చిపో యారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులను రెచ్చగొట్టాలని కుఠిల యత్నాలు చేశారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌ తులసీరెడ్డి వారి ప్రయత్నాలకు ఆజ్యం పోశారు. ఎర్రమంజిల్‌ కాలనీ దగ్గరలోని నీటిపారుదల శాఖ కార్యాలయం(జలసౌధ) వద్ద శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్తత పరిస్థి తులు నెలకొన్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలంటూ తెలంగాణ ఉద్యోగులు నిరసనకు దిగారు. వీరిరువురు పోటాపోటీ నినాదాలు చేశారు. ఒక దశలో సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులపై దాడికి యత్నించారు. దీంతో  పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయినా సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులపై దాడికి ప్రయత్నించడంతో మళ్లీ  పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదిలా ఉండగా సీమాంధ్ర ఉద్యోగులకు మద్దతుగా 20 సూత్రాల అమలు పథకం కమిటీ చైర్మన్‌ తులసీరెడ్డి అక్కడికి చేరుకుని సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ ఉద్యోగులు ఆయనను అడ్డుకోవడంతో మరింత ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ తమ ఆందోళన కొనసాగించారు.