బాలరాజుపై దాడి విచారణ జరిపిస్తాం


దోషులను శిక్షిస్తాం : జానా
జై తెలంగాణ అంటే దాడి చేస్తారా
మండిపడ్డ తెలంగాణ మంత్రులు
గాయపడిన విద్యార్థులకు మంత్రుల పరామర్శ
కాంగ్రెస్‌ నేతలను అడ్డుకున్న విద్యార్థులు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8 (జనంసాక్షి) :
ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ విద్యార్థి నాయకుడు బాలరాజుపై దాడి ఘటనపై విచారణ జరిపిస్తామని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి కె. జానారెడ్డి తెలిపారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన పేర్కొన్నారు. జై తెలంగాణ అంటే దాడి చేస్తారా అంటూ మండిపడ్డారు. సీమాంధ్ర ఉద్యోగుల దాడి, పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన తెలంగాణ విద్యార్థులను తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు పరామర్శించారు. శనివారం ఏపీఎన్జీవోల సభ సందర్భంగా తెలంగాణ నినాదాలు చేసిన బాలరాజు యాదవ్‌పై సీమాంధ్ర ఉద్యోగులు విచక్షణా రహితంగా దాడి చేయగా, నిజాం కాలేజ్‌ హాస్టల్‌లో చొరబడిన పోలీసులు విద్యార్థులపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడగా, పలువురు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులు నాంపల్లి కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని తెలంగాణ మంత్రులు జానారెడ్డి, డీకే అరుణ, సునీతాలక్ష్మారెడ్డి, ఎంపీలు వి.హనుమంతరావు, రాపోలు ఆనందభాస్కర్‌, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు. విద్యార్థులను పరామర్శించేందుకు తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఓయూ విద్యార్థులు, తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏపీ ఎన్జీవోల సభపై స్పందించని మీరు ఇప్పుడెందుకు వచ్చారని జానారెడ్డిని నిలదీశారు. తెలంగాణ విద్యార్థులు, ప్రజలపై సీమాంధ్ర గూండాలు, పోలీసులు దాడులు చేస్తుంటే చూస్తూ కూర్చొని.. ఇప్పుడు పరామర్శించేందుకు వస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం తెలంగాణలో సమైక్య సభకు అనుమతి ఇస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారు? పోలీసుల పహారా పెట్టి తెలంగాణవాదులను చితకబాదుతుంటే ఇంకా పదవుల్లో ఎందుకు కొనసాగుతున్నారని నిలదీశారు. పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టారు. విద్యార్థులకు జానారెడ్డి సర్దిచెప్పారు. హైదరాబాద్‌లో తెలంగాణ వారికే రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.