శ్రీశాంత్‌ , అంకిత్‌చవాన్‌లపై జీవితకాల నిషేధం

అమిత్‌సింగ్‌పై ఐదేళ్ళు , సిధ్ధార్థ్‌ త్రివేదీపై ఏడాది వేటు
చండిలాపై నిర్ణయం తీసుకోని బీసిసిఐ
న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 13 :ఐపీఎల్‌లో స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆటగాళ్ళపై బీసిసిఐ కొరడా ఝుళిపించింది. ప్రధాన పాత్రధారులుగా భావిస్తోన్న రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెటర్లు శ్రీశాంత్‌ , అంకిత్‌ చవాన్‌లపై జీవితకాల నిషేధం విధించింది.  యాంటీ కరప్షన్‌ యూనిట్‌ చీఫ్‌ రవి సవాని ఇచ్చిన నివేదికపై పూర్తిగా చర్చించిన తర్వాత బీసిసిఐ డిసిప్లినరీ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీశాంత్‌తో పాటు అంకిత్‌ చవాన్‌ జీవితకాలంలో క్రికెట్‌కు దూరంగా ఉండడంతో పాటు దాని సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనే వీలులేదు. అలాగే మరో క్రికెటర్‌ అమిత్‌సింగ్‌ ఐదేళ్ళ నిషేధం విధించగా… సిధ్ధార్థ్‌ త్రివేదీపై ఏడాది పాటు వేటు పడింది. అయితే అజిత్‌ చండిలాపై మాత్రం బీసిసిఐ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్‌ ఆరోసీజన్‌లో వీరంతా స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. ఉధ్ధేశపూర్వకంగా ఎక్కువ పరుగులు ఇచ్చేందుకు బుకీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే వారి నుండి డబ్బుతో పాటు ఖరీదైన బహుమతులు కూడా అందుకున్నారు. దాదాపు మూడున్నర నెల విచారణ అనంతరం బీసిసిఐ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రధాన పాత్రదారునిగా భావిస్తోన్న శ్రీశాంత్‌ ఒక ఓవర్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చేందుకు తగిన సూచనలు కూడా తీసుకున్నాడు. అదే సమయంలో వారికి అర్థమయ్యే విధంగా మినీ టవల్‌ను ఫ్యాంటు జేబు నుండి సగం బయటకు కనిపించేటట్టు పెట్టుకోవడం వంటి పనులు చేశాడు. ¬టల్‌లో అపరిచిత వ్యక్తులతో మాట్లాడడంతో పాటు అనుమానాస్పదంగా ప్రవర్తించడం వంటివి చేయడం ద్వారా శ్రీశాంత్‌ దొరికిపోయాడు. దీంతో అతనిపై జీవితకాల నిషేధం విధించారు. అటు బుకీలతో సంబంధాలు పెట్టుకోవడంతో పాటు ఫిక్సింగ్‌కు పాల్పడడంతో అంకిత్‌ చవాన్‌పై కూడా లైఫ్‌ బ్యాన్‌ విధించారు. అటు బుకీలు సంప్రదించినప్పుడు జట్టు మేనేజ్‌మెంట్‌కు గానీ , బీసిసిఐకి కాని సమాచారమివ్వనందుకు సిధ్ధార్థ్‌ త్రివేదీ మూల్యం చెల్లించుకున్నాడు. అతనిపై ఏడాది పాటు నిషేధం విధించారు. అయితే మరో యువక్రికెటర్‌ హర్మీత్‌సింగ్‌కు మాత్రం ఊరట లభించింది. హర్మీత్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో హర్మీత్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. ఫిక్సింగ్‌ విషయంలో బీసిసిఐ ఎప్పుడూ అలసత్వంతో వ్యవహరించదని , ఈ కఠిన నిర్ణయాలతో అది తగ్గుముఖం పడుతుందని ఆశిస్తున్నట్టు

బోర్డ్‌ తన ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే రవి సవానీ నివేదికను పరీశించిన తర్వాత బీసిసిఐ డిసిప్లినరీ కమిటీ ఆటగాళ్ళ వాదనను కూడా వింది. శ్రీశాంత్‌ , చవాన్‌లతో పాటు అమిత్‌సింగ్‌ , హర్మీత్‌సింగ్‌ , సిధ్ధార్ధ్‌ త్రివేదీ డిసిప్లినరీ కమిటీ ముందు హాజరై తమ వాదనను వినిపించారు. తాము ఎలాంటి తప్పూ చేయలేదని వీరంతా కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. వీరితో సమావేశం ముగిసిన తర్వాత బీసిసిఐ సెక్రటరీ తరపున ఒక ప్రకటన విడుదల చేస్తూ నిర్ణయాలను ప్రకటించారు.

ఎవరిపై ఏ చర్యలు ః

1. శ్రీశాంత్‌ , అంకిత్‌ చవాన్‌ – జీవితకాల నిషేధం

బుకీలతో సంప్రదింపులు జరపడం , వారితో ఒప్పందాలు కుదుర్చుకోవడం , ఖరీదైన బహుమతులు తీసుకోవడం , మ్యాచ్‌ సమయంలో అనుమానాస్పదంగా ప్రవర్తించడం

2. అమిత్‌సింగ్‌ – ఐదేళ్ళ నిషేధం

సహచరుల ప్రోత్సాహంతో ఫిక్సింగ్‌కు పాల్పడడం

3. సిధ్ధార్థ్‌ త్రివేదీ – ఏడాది నిషేధం

బుకీలు సంప్రదించినప్పుడు ఆ విషయాన్ని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ , బీసిసిఐ దృష్టికి తీసుకురాకపోవడం

4. హర్మీత్‌సింగ్‌ – క్లీన్‌చిట్‌

ఫిక్సింగ్‌ వివాదంలో వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకపోవడంతో కేసును కొట్టివేసారు.