పాక్ డొమెస్టిక్ టీమ్‌కు వీసాలు జారీ
లా¬ర్,సెప్టెంబర్ 13 :ఛాంపియన్స్ లీగ్ టీ ట్వంటీ టోర్నీలో ఆడేందుకు పాకిస్థాన్ డొమెస్టిక్ టీ ట్వంటీ టీమ్ ఫైసలాబాద్ వోల్వ్స్‌కు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఆ జట్టు ఆటగాళ్ళకు భారత ప్రభుత్వం వీసాలు జారీ చేసింది. రెండు దేశాల సరిహద్దులో సరైన సంబంధాలు లేకపోవడంతో ముందు ఆ జట్టుకు వీసాలు ఇచ్చేందుకు భారత్ నిరాకరించింది. దీంతో ఫైసలాబాద్ ఆడే మ్యాచ్‌లపై సందిగ్ఘత నెలకొంది. అయితే గత రెండు రోజులుగా వారి టీమ్ మేనేజ్‌మెంట్ , పాక్ క్రికెట్ బోర్డుతో పాటు బీసిసిఐ యత్నాలు ఫలించాయి. వీసా నిరాకరణ తర్వాత కూడా ఫైసలాబాద్ ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను కొనసాగించి ఆశాభావంతో ఉన్నారు. చివరికి వారి కాన్ఫిడెన్స్‌కు తగ్గట్టుగానే వీసాలు లభించడంతో ఆ జట్టు భారత్‌కు బయలుదేరనుంది. ఫైసలాబాద్ వోల్వ్స్ జట్టులో పలువురు పాక్ సీనియర్ క్రికెటర్లు కూడా ఉన్నారు. మిస్బాబుల్ హక్ , సయీద్ అజ్మల్‌తో పాటు ఎహసాన్ అదిల్ ప్రస్తుతం జింబాబ్వే టూర్‌లో ఉన్నారు. దీంతో ఆ జట్టు రెండు విడతలుగా భారత్‌కు రానుంది. జింబాబ్వే టూర్‌లో ఉన్న ముగ్గురు ఆటగాళ్లు అక్కడ నుండి నేరుగా భారత్ చేరుకోనున్నట్టు పిసిబి వర్గాలు తెలిపాయి. మిగిలిన జట్టు శనివారం మొహలీలో అడుగుపెట్టనుంది. క్వాలిఫైయింగ్ టోర్నీ ఆడనున్న ఫైసలాబాద్ సెప్టెంబర్ 17న జరిగే తొలి మ్యాచ్‌లో ఒట్టాగో వోల్ట్స్‌తో తలపడనుంది. దీంతో ఛాంపియన్స్ లీగ్ టీ ట్వంటీ టోర్నీలో ఆడుతోన్న రెండో పాక్ జట్టుగా ఫైసలాబాద్ రికార్డులకెక్కింది. గత ఏడాది సెయిల్‌కోట్ స్టాలిన్స్ కూడా సిఎల్ టీ ట్వంటీలో ఆడింది.