ఇదెక్కడి న్యాయం : హరీష్‌రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 16 :సీమాంధ్రలో ఉద్యమం జరుగుతుంటే ముఖ్యమంత్రి కిరణ్ ఫైళ్లపై సంతకం పెట్టడం మానేశారా.. చంద్రబాబు హెరిటేజ్ పాల ఉత్పత్తి ఆగిందా అని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రశ్నించారు.సోమవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు.తెలంగాణకో న్యాయం.. సీమాంధ్రకు మరో న్యాయమా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉద్యమ ప్రభావం బాగా ఉందని చెప్పేందుకే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేదలకు ఇవ్వాల్సిన రేషన్ కార్డులను, పెన్షన్లను నిలిపేశారని ఆరోపించారు. గత రచ్చబండలో తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలను నేటికీ కిరణ్‌కుమార్‌రెడ్డి అమలు చేయలేదని అన్నారు. రచ్చబండ పెట్టి 16 నెలలైనా ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. సీమాంధ్రలో కార్పొరేట్ ఆసుపత్రులు మూతపడలేదని, ప్రైవేటు ట్రావెల్స్ యథేచ్ఛగా తిరుగుతున్నాయని ఆరోపించారు.అయితే పేదలకు ఉపయోగపడే ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ వైద్యశాలలు మాత్రం మూతపడ్డాయన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల కార్యక్రమాలు ఆగాయని చెప్పుకునేందుకు సీఎం కిరణ్ ప్రయత్నిస్తున్నారని అన్నారు.



