ఛాంపియన్స్ ఫైట్‌లో విజేత ఎవరో…
ఇవాల్టి నుండే సిఎల్ టీ ట్వంటీ
మొహలీ ,సెప్టెంబర్ 16:గత రెండు నెలలుగా క్రికెట్ సంగ్రామానికి దూరమైన భారత్ అభిమానులను అలరించేందుకు ఛాంపియన్స్ లీగ్ టీ ట్వంటీ టోర్నీ ముస్తాబైంది. ఐపీఎల్ తరహాలోనే విదేశీ డొమెస్టిక్ టీ ట్వంటీ ఛాంపియన్స్ మధ్య జరిగే ఈ టోర్నీలో సత్తా చాటేందుకు 10 జట్లు సిధ్దమయ్యాయి. ఇక 20 రోజుల పాటు టీ ట్వంటీ విందు ఆరగించేందుకు అభిమానులూ విూరు సిధ్దమేనా…ఛాంపియన్స్ లీగ్ టీ ట్వంటీ సందడి మంగళవారం నుంచే షురూ కానుంది. ప్రధాన టోర్నీకి ముందు జరిగే క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో దీనికి తెరలేవనుంది. మూడు ఐపీఎల్ టీమ్స్‌తో పాటు పలు విదేశీ డొమెస్టిక్ జట్లు ఈ టోర్నీలో అలరించనున్నాయి. ఛాంపియన్స్ లీగ్ ఇది ఐదో ఎడిషన్. ఐపీఎల్‌ను స్ఫూర్తిగా తీసుకుని విదేశీ డొమెస్టిక్ టీ ట్వంటీ టోర్నీలలో విజేతలుగా నిలిచిన జట్ల మధ్య దీనిని నిర్వహిస్తున్నారు. బీసిసిఐతో పాటు క్రికెట్ ఆస్టేల్రియా , క్రికెట్ సౌతాఫ్రికా దీని రూపకర్తలు. 2009లో తొలి సీజన్ జరగ్గా… ఆస్టేల్రియాకు చెందిన న్యూసౌత్‌వేల్స్ విజేతగా నిలిచింది. 2010లో చెన్నై సూపర్‌కింగ్స్ , 2011లో ముంబై ఇండియన్స్ , 2012లో సిడ్నీ సిక్సర్స్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్నాయి. సిఎల్‌టీ ట్వంటీకి ఆతిథ్యమివ్వడం భారత్‌కిది మూడోసారి. భారత్ నుండి ఐపీఎల్ ఆరోసీజన్‌లో విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ , రన్నరప్ చెన్నై సూపర్‌కింగ్స్‌తో పాటు మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ ప్రధాన టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి. అలాగే ఆస్టేల్రియా నుండి బిగ్‌బాష్ లీగ్ విజేత బ్రిస్బేన్ హీట్స్ , రన్నరప్ పెర్త్ స్కాచర్స్ పోటీ పడుతుండగా…సౌతాఫ్రికా నుంచి హైవీల్ట్ లయన్స్ , టైటాన్స్ జట్లు ఆడుతున్నాయి. అటు కరేబియన్ టీ ట్వంటీలో ఛాంపియన్ ట్రినిడాడ్ అండ్ టొబాగో కూడా నేరుగా అర్హత సాధించింది. అయితే మిగిలిన రెండు బెర్తుల కోసం క్వాలిఫైయింగ్ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ ఆరోసీజన్‌లో నాలుగో స్థానం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ , పాకిస్థాన్ టీమ్ ఫైసలాబాద్ వోల్వ్స్ , న్యూజిలాండ్ టీమ్ వొట్టాగో వోల్ట్స్ , శ్రీలంకకు చెందిన కందురత మరూన్స్ క్వాలిఫైయింగ్ టోర్నీలో పోటీపడనున్నాయి. దీనిలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రధాన టోర్నీకి అర్హత సాధించనున్నాయి. ప్రధాన టోర్నీలో ఐపీఎల్ జట్ల పైనే అందరి దృష్టీ ఉంది. ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్ మరోసారి టైటిల్ ఫేవరెట్‌గా భావిస్తున్నారు. ఐపీఎల్ ఆరోసీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఆ జట్టు ఛాంపియన్స్ లీగ్‌లో విజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది. అటు ఐపీఎల్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ కూడా టైటిల్ రేసులో ఉంది. యువక్రికెటర్ రోహిత్‌శర్మ సారథ్యంలో ఆ జట్టు ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించింది. అదే జోరును సిఎల్ టీ ట్వంటీలోనూ కొనసాగించేందుకు ముంబై ఇండియన్స్ సిధ్ధమవుతోంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కెరీర్‌లో ఇదే చివరి టీ ట్వంటీ టోర్నీ. దీంతో సచిన్‌కు టైటిల్ విజయంతో వీడ్కోలు చెప్పాలని సహచరులు భావిస్తున్నారు. మరో ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆరోసీజన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆ జట్టుకు చెందిన ఆటగాళ్ళు నిషేధానికి గురయ్యారు. దీంతో పోయిన పరువును తిరిగి సాధించేందుకు ఆట ద్వారా సత్తా చాటాలని రాజస్థాన్ సిధ్ధమైంది. ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న రాహుల్ ద్రావిడ్‌కు కూడా ఇదే చివరి టీ ట్వంటీ టోర్నీ కావడంతో ఆసక్తి నెలకొంది. మిగిలిన జట్లను పరిశీలిస్తే…పెర్త్ స్కాచర్స్ , బ్రిస్బేన్ హీట్స్‌తో పాటు లయన్స్ , టైటాన్స్ కూడా స్టార్ ప్లేయర్స్‌తో కళకళలాడుతున్నాయి. గత సీజన్లలో కూడా విదేశీ జట్లు సంచలన విజయాలు సాధించిన నేపథ్యంలో ఎవ్వరినీ తక్కువ అంచనా వేసేందుకు వీలులేదు. ఇక క్వాలిఫైయింగ్ టోర్నీలో పోటీపడుతోన్న సన్‌రైజర్స్ మెరుగ్గా రాణిస్తే ప్రధాన టోర్నీకి అర్హత సాధించే ఛాన్సుంది. అలాగే పాక్ టీమ్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎదురుచూస్తోంది. మొత్తం ఆరు మిలియన్ డాలర్లు ప్రైజ్‌మనీగా ఉన్న ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు 2.5 మిలియన్ డాలర్లు , రన్నరప్‌కు 1.3 మిలియన్ డాలర్లు లభించనుంది. అక్టోబర్ 6న ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగే ఫైనల్‌తో టోర్నీకి తెరపడనుంది.
క్వాలిఫైయింగ్‌లో నేటి మ్యాచ్‌లు ః
1. ఫైసలాబాద్ వోల్వ్స్ ృ వొట్టాగో వోల్ట్స్ – సాయంత్రం 4 గంటలకు
2. సన్‌రైజర్స్ హైదరాబాద్ ృ కందురత మరూన్స్ – రాత్రి 8 గంటలకు
వేదిక – మొహాలీ