జేబులో టవల్‌ పెట్టుకోవడం సాధరణమే : శ్రీశాంత్‌

ముంబై ,సెప్టెంబర్‌ 16 :స్పాట్‌ఫిక్సింగ్‌ వివాదంలో తనకు ఎలాంటి పాత్రా లేదని రాజస్థాన్‌ రాయల్స్‌ ఫాస్ట్‌బౌలర్‌ శ్రీశాంత్‌ మరోసారి స్పష్టం చేశాడు. క్రికెట్‌ను దైవంలా కొలిచే తాను ఎప్పుడూ దాని ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నం చేయలేదని చెప్పాడు. అయితే తాను ఫిక్సింగ్‌కు పాల్పడ్డానంటూ అందరూ సాక్ష్యంగా చూపిస్తోన్న జేబులో టవల్‌ పెట్టుకోవడంపై శ్రీశాంత్‌ స్పందించాడు. ఆటగాళ్ళు బంతిని తుడిచేందుకు , చెమటను తుడిచేందుకు టవల్‌ పెట్టుకోవడం సాధారణమని వ్యాఖ్యానించాడు. ఏప్రిల్‌-మే నెలలో మొహాలీలో వేడి చాలా ఎక్కువగా ఉంటుందన్నాడు. దానిని సాక్ష్యంగా చూపించడంపై మండిపడ్డాడు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లలోనూ తాను టవల్‌ పెట్టుకునే ఆడినట్టు చెప్పాడు. ప్రతీ జట్టులో ఆటగాళ్ళు టవల్‌ ఉపయోగించారని , తానేదో ప్రత్యేకంగా పెట్టుకున్నానంటూ చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. అటు స్పాట్‌ఫిక్సింగ్‌పై విచారణ జరిపి బీసిసిఐకి నివేదిక సమర్పించిన రవిసవానీపై కూడా శ్రీశాంత్‌ విమర్శలు గుప్పించాడు.నివేదికలో పోలీసు అధికారుల స్టేట్‌మెంట్స్‌ , విూడియా కథనాల ,పేపర్‌ క్లిప్పింగ్స్‌ ఆధారంగానే తనను దోషిగా చిత్రీకరించడంపై మండిపడ్డాడు. తనకు వ్యతిరేకంగా కవీసం ఒక్క సాక్ష్యం కూడా లేదని , అయినా జీవితకాల నిషేధం విధించారని ఆవేదన వ్యక్తం చేశాడు. బీసిసిఐ నిషేధంపై ఈ కేరళ క్రికెటర్‌ కోర్టులో అప్పీల్‌ చేయనున్నట్టు సమాచారం.