జపాన్‌ ఓపెన్‌లో సింధుపైనే భారత్‌ ఆశలు

టోక్యో ,సెప్టెంబర్‌ 16 : స్టార్‌ షట్లర్‌ సైనానెహ్వాల్‌ విశ్రాంతి తీసుకోవడంతో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న జపాన్‌ఓపెన్‌ భారత్‌ ఆశలన్నీ యువక్రీడాకారిణి పివి సింధుపైనే ఉన్నాయి.ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌లో విరామం లేకుండా ఆడడంతో సైనా జపాన్‌ ఓపెన్‌కు దూరమైంది. అటు పురుషుల సింగిల్స్‌లో తెలుగుతేజం పారుపల్లి కష్యప్‌ కూడా గాయం కారణంగా టోర్నీలో ఆడడం లేదు. ఐబీఎల్‌ సమయంలో తన మోకాలికి గాయమైందని , బిజీ షెడ్యూల్‌ దృష్ట్యా రిస్క్‌ తీసుకోవడం లేదన్నాడు. దీంతో తెలుగుతేజం పివి సింధుపైనే భారత్‌ ఆశలు పెట్టుకుంది. గత కొంత కాలంగా అంతర్జాతీయ స్థాయిలో విశేషంగా రాణిస్తోన్న సింధు ఇటీవల వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించింది. ఐబీఎల్‌లో కూడా పలువురు స్టార్‌ ప్లేయర్లపై సంచలన విజయాలు నమోదు చేయడం ద్వారా సూపర్‌ ఫామ్‌తో దూసుకెళుతోంది. ఫ్యూచర్‌ సైనాగా భావిస్తోన్న సింధు ప్రస్తుతం వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో కొనసాగుతోంది. జపాన్‌ ఓపెన్‌లో సింధు ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగుతోంది. మొదటి రెండు రౌండ్లలో క్వాలిఫైయింగ్‌ టోర్నీ నుండి వచ్చే ప్రత్యర్థులే కావడంతో క్వార్టర్‌ ఫైనల్‌ చేరడం ఆమెకు పెద్ద కష్టం కాదని చెప్పొచ్చు. డ్రా ప్రకారం చూస్తే సింధు క్వార్టర్‌ ఫైనల్లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ , చైనా ప్లేయర్‌ లి జురైతో తలపడే అవకాశాలున్నాయి. మహిళల సింగిల్స్‌లో మరో భారత క్రీడాకారిణి తన్వి లాద్‌ బరిలోకి దిగుతోంది.