యూటీ డిమాండ్‌ ప్రజాస్వామ్య విరుద్ధం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్రకు చెందిన పెటుబడిదారులు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఆ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు వారికి మౌత్‌ పీస్‌లుగా మారి అదే డిమాండ్‌ను కేంద్రం ముందు ఉంచుతూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. మొదట తెలుగు వారంతా కలిసే ఉండాలని డిమాండ్‌ చేసిన వాళ్లే తర్వాత తమకు దక్కని హైదరాబాద్‌ తెలంగాణకూ దక్కొద్దనే కుట్రలకు తెరతీశారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌ను కేంద్ర పాలితప్రాంతం చేయాలనే డిమాండ్‌. తెలంగాణ ఏర్పాటుతో తెలుగు తల్లిని, తెలుగు జాతిని, తెలుగు వారిని విడదీస్తారా? దక్షిణ భారత దేశంలో ఆంధ్రప్రదేశ్‌ పెద్ద రాష్ట్రంగా ఉండటం తమిళులు, మలయాలీలకు ఇష్టం లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్‌ను విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు అంటూ సెంటిమెంట్‌తో కూడిన భారీ డైలాగులు కొట్టిన సీమాంధ్ర ప్రతినిధులు తెలంగాణ ఏర్పాటు ఖాయమని తెలుసుకున్న తర్వాత హైదరాబాద్‌పై గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారు. తమ సర్వస్వం దారపోసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని కూడా చెప్పేస్తున్నారు. తాము కష్టపడి హైదరాబాద్‌ను ప్రపంచ శ్రేణి నగరంగా అభివృద్ధి చేస్తే ఉన్న పళంగా వెళ్లగొడ్తరా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశామని చెప్తున్న వ్యక్తులు, వారి కుటుంబ నేపథ్యాలు ఆరు దశాబ్దాల క్రితం ఎరిగిన వారు వారి ప్రకటనలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిపై నోరుతెరిస్తే పుట్టెడు అబద్దాలు చెప్పే వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఆయన హయాంలో హైదరాబాద్‌ చారిత్రక, వారసత్వ సంపద విధ్వంసం మొదలైంది. ఆ తర్వాతి దానికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. అలాంటి వ్యక్తి ప్రపంచ బ్యాంకు నిధులతో కొన్ని ఫ్లై ఓవర్లు, ఒక హైటెక్‌ సిటీ కట్టేసి ఆ కాంట్రాక్టర్ల నుంచి వేలాది కోట్ల రూపాయల అనుచిత లబ్ధి పొంది హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చెప్తున్నాడు. హైదరాబాద్‌ను చంద్రబాబు అభివృద్ధి చేయలేదు. ప్రజా ధనాన్ని పీకల్దాక మింగి తాను అభివృద్ధి చెందాడు. ఆయన అంతటితో ఆగలేదు. గతంలో హైదరాబాద్‌ అంటే చార్మినార్‌ మాత్రమే చూపేవారని ఇప్పుడు హైటెక్‌సిటీని చూపుతున్నారని గర్వంతో ఉప్పొంగాడు. హైదరాబాద్‌ జనాభాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల శాతమెంత? హైదరాబాద్‌ తలసరి ఆదాయంలో వారి వాటా ఎంత? సైబర్‌ టవర్స్‌ కట్టిన తర్వాత హైదరాబాద్‌లో కొత్తగా వచ్చిన మార్పులేమిటీ? అనేది విస్మరించి మాట్లాడుతున్నాడు. సాఫ్ట్‌వేర్‌ రంగ అభివృద్ధితో హైదరాబాద్‌ నగరం కొంత అభివృద్ధి చెందవచ్చు. మాదాపూర్‌, కొండాపూర్‌ ప్రాంతాలు ఇప్పుడు ఐటీ హబ్‌గా పరిణితి చెందొచ్చు. కానీ దానిని మాత్రమే అభివృద్ది కొలమానంగా చూడలేం. ఐటీ రంగంలో ఒక్క హైదరాబాద్‌ మాత్రమే అభివృద్ధి చెందలేదు. ఈ రంగంలో బెంగళూర్‌ మనకంటే చాలా ముందుంది. చెన్నై కూడా మనకంటే ముందంజలోనే ఉంది. ఐటీ రంగానికి దేశంలో బీజం వేసిన వ్యక్తి రాజీవ్‌గాంధీ ఆ విషయమే తెలియనివారు ఇప్పటికీ ఉండొచ్చు. ఎందుకంటే ఐటీ బాబు ప్రచార మాయ అలాంటిది. ఆయన ఐటీని పట్టుకొని వేల్లాడ్డంతోనే ప్రజలు శాశ్వత సెలవు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా అవే అసంబద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు. అసలు హైదరాబాద్‌ను కేంద్ర పాలితప్రాంతం చేయాలనే డిమాండ్‌కు బీజం వేసిందే చంద్రబాబు. ఆయన వెనుకున్న పెత్తందారులను ఎగదోసి సీమాంధ్ర నేతలను ఈ డిమాండ్‌ దిశగా పురిగొల్పాడు. వారు కీ ఇవ్వడంతోనే చిరంజీవిలాంటి కేంద్ర మంత్రులు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు రాష్ట్ర మంత్రులు హైదరాబాద్‌ను యూటీ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. విభజనపై తన వైఖరే చెప్పని చంద్రబాబు ప్రజలకు సమన్యాయం చేయలేకుంటే విభజనే వద్దని ప్రతిపాదించాడు. బయటికి ఒకటి, లోపల ఒకటి మాట్లాడటం, అలాంటి రాజకీయాలే చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. చిరంజీవి సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తి. చెన్నై నుంచి హైదరాబాద్‌కు సినిమా పరిశ్రమ వచ్చిన ఆయన స్టార్‌డమ్‌ ఎంతమాత్రం తగ్గలేదు. సినిమా వ్యాపారంలో ఆయన కుటుంబం ఎంతో ఎత్తుకు ఎదిగింది. సినిమాలో నటించినందుకు నైజాం పంపిణీ హక్కుల ద్వారా వచ్చే సొమ్మును పారితోషకంగా తీసుకున్న చిరంజీవి ఇప్పుడు ఆ నైజాం ఏరియాకు కొరివి పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. తన ఆర్థిక వృద్ధికి కారణమైన ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. హైదరాబాద్‌ ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి చెందింది అని చెప్పడం సత్య దూరం. సీమాంధ్ర ప్రాంతానికి బ్రిటిష్‌ పాలన నుంచి విముక్తి లభించే సరికే హైదరాబాద్‌ అన్నింటా అభివృద్ధి చెందిన ప్రాంతం. ప్రపంచ శ్రేణి వాణిజ్య కేంద్రం. హైదరాబాద్‌లో నిజాం కాలంలో నిర్మించిన అనేక భవనాల్లోనే ఇప్పటికీ రాష్ట్ర పాలన సాగుతోంది. దానిని కప్పిపుచ్చి సీమాంధ్రులు తామే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని అసంబద్దమైన వాదన లేవనెత్తారు. తాము అభివృద్ధి చేశాం కాబట్టి హైదరాబాద్‌ను యూటీ చేయాలని కోరుతున్నారు. హైదరాబాద్‌ను, తెలంగాణను పీల్చిపిప్పి చేసి అభివృద్ధి చెందింది సీమాంధ్రులు. పొట్ట చేతబట్టుకొని హైదరాబాద్‌కు వచ్చి ఇప్పుడు కుభేరులు, ప్రపంచశ్రేణి కాంట్ట్రార్లుగా వృద్ధి చెందారు. 57 ఏళ్లలో వాళ్లు ఎన్ని అడ్డదారులు తొక్కి ఉంటే ఇంతలా వృద్ధి చెందుతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌ అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కాదు తిరుపతి, వైజాగ్‌ ఇతర సీమాంధ్ర నగరాల అభివృద్ధిలో తెలంగాణ ప్రజలకూ భాగస్వామ్యం ఉంది. మరి ఆ నగరాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తారా? హైదరాబాద్‌, తెలంగాణ ఆదాయాన్ని తరలించి అభివృద్ధి చేసిన ప్రాంతాలను యూటీలుగా చేయకుండా, ఇక్కడ ఉపాధి పొంది వృద్ధి తాము ఉండటానికి రక్షణ కావాలి కాబట్టి యూటీ చేయాలని కోరడం ఎంతవరకు సమంజసం. హైదరాబాద్‌ను దోచుకున్న పెట్టుబడిదారులు, ఇంకా దోపిడీ చేయాలనుకుంటున్న వారు, ఇక్కడ అక్రమంగా ఉద్యోగాలు పొందిన సీమాంధ్రులు మినహా, సీమాంధ్రలోని 13 జిల్లాల ప్రజలు యూటీ కావాలని కోరడం లేదు. విభజన అనివార్యమైనప్పుడు యూటీగా హైదరాబాద్‌ను మార్చి ఉమ్మడ రాజధానిగా కొనసాగించాలని కోరడం సీమాంధ్రుల ప్రజాస్వామిక హక్కులను కూడా హరించడమే. వారికి కొత్త రాజధాని ఏర్పడితే అక్కడ కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.. అది సీమాంధ్ర ప్రజలకే లబ్ధి చేకూరుస్తుంది. పాలన కేంద్రం అందుబాటులో ఉంటే రాకపోకలు సులువుగా సాగించవచ్చు. తద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయి. ఈ విషయాలన్ని మరుగు పరిచి తెలంగాణ, సీమాంధ్ర ప్రజల హక్కుల పణంగా పెట్టి పిడికెడు మంది పెట్టుబడిదారులు, వేలాది మంది అక్రమ ఉద్యోగుల కోసం యూటీ చేయాలని కోరడం సమంజసం కాదు.