సంజయ్‌దత్ పెరోల్ రగడ
పుణె/ముంబయి, డిసెంబర్ 7 (జనంసాక్షి) :
జైలు శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు పెరోల్ ఇవ్వడం వివాదాస్పదమైంది. పుణెలోని ఎరవాడ జైలు ఎదుట దీనిపై నిరసనలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. పుణె డివిజనల్ కమిషనర్ ప్రభాకర్ దేశ్‌ముఖ్ శుక్రవారం సంజయ్‌దత్ కు పెరోల్ జారీ చేశారు. దత్ ఇంతకుముందు వైద్యపరమైన కారణాలతో నెల రొజులపాటు సెలవుతో జైలు బయటికి వెళ్లి అక్టోబర్ 30న తిరిగి జైలుకెళ్లారు. ఈసారి తన భార్య మాన్యత ఆనారోగ్యాన్ని కారణంగా చూపి పెరోల్ కోరారు. అయితే మాన్యత ఓ చిత్ర ప్రదర్శనకు , ఓ సెలబ్రిటీ పుట్టినరోజు వేడులకు హాజరైనట్లు శనివారం కొన్ని దినపత్రికల్లో ఫోటోలు ప్రచురించడంతో ఆమె ఆనారోగ్యంపై పలు ప్రశ్నలు తలెత్తి వివాదం రేగింది. దీనితో మహారాష్ట్ర హోమంత్రి ఆర్‌ఆర్ పాటిల్ సంజయ్‌దత్‌కు ఏ ప్రాతిపదికన పెరోల్ ఇచ్చారనే అంశంపై విచారణ జరపాలని ఆదేశించారు. పెరొల్‌కు అనుమతి ఇవ్వడానికి దారితీసిన పత్రాలను పరిశీలిస్తామని ఆర్‌ఆర్‌పాటిల్ విలేకరులతో చెప్పారు. సంజయ్‌దత్ పట్ల సానుకూలత చూపుతున్నారంటూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎరవాడ జైలు ఎదుట ఆందోళనకు దిగింది. నల్లజండాలు ప్రదర్శిస్తూ పెరోల్ రద్దు చేయాలని డిమాండ్ చేసింది. దత్‌కు పెరోల్ ఇచ్చిన ప్రత్యేక సదుపాయాలు కల్పించినా మహారాష్ట్రవ్యాప్తంగా జైల్‌భరో నిర్వహిస్తామని ఆర్పీఐ ప్రకటించింది. అధికారులు తమకున్న విచక్షణ అధికారులను దుర్వినియోగం చేస్తున్నారని ముంబయి వరుస పేలుళ్ల కేసులో దోషి పర్వేజ్ షేక్ న్యాయవాది ఆరోపించారు. పర్వేజ్‌ను కలిసేందుకు తనను అనుమతించడం లేదనీ, సంజయ్‌దత్‌కు మాత్రం పెరోల్ ఇచ్చారని విమర్శించారు. తాజా వివాదం నేపధ్యంలో సంజయ్‌దత్ భార్య మాన్యత కాలేయంలో కణతి, గుండె ఆరోగ్య సమస్య ఉన్నట్లు ఆమెను పరీక్షించిన వైద్యుడు పేర్కొన్నారు. మాన్యతకు కాలేయ సమస్యతోపాటు ఛాతినోప్పి ఉందని, బరువు కూడా తగ్గారని వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించామని వాటి ఫలితాలు వస్తే శస్త్రచికిత్స అవసరమైనదని, లేనిది చెబుతామని డాక్టర్ అజయ్ ఛాయులే తెలిపారు. వారం రోజుల క్రితం ఆమె తనను సంప్రదించారని కొన్ని మందులు రాశానని చెప్పారు.గతంలో ఆమె లీలావతి ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారని పేర్కొన్నారు.