అసెంబ్లీ సమావేశాల తర్వాత ఢిల్లీ వెళ్తాం
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
కిరికిరిలేని హైదరాబాద్ కోసమే పోరాడుతాం : కోదండరామ్
హైదరాబాద్, డిసెంబర్ 7 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఢిల్లీకి వెళ్తామని టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో టీ జేఏసీ నేతలు శనివారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ను కలిసి అభినందించాయి. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సత్కరించాయి. కేబినెట్ ఆమోదించిన తెలంగాణ ముసాయిదాలోని లోపాలపై కేసీఆర్‌తో జేఏసీ నాయకులు చర్చించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకూ పది జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈనెల 12న ప్రారంభమయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తెలంగాణపై శాసనసభ అభిప్రాయం కేంద్రానికి నివేదించేందుకు తెలంగాణ నేతలంతా సమన్వయంతో పనిచేయాల్సి ఉందని అన్నారు. శాసనసభ సమావేశాల్లో అవసరమైతే స్పీకర్‌కు బాసటగా నిలవాలని సూచించారు. ఈ సందర్భంగా టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, కిరికిరి లేని తెలంగాణ సాధన కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్ర ప్రాంతం వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని, వారు ఇక్కడ నిర్భయంగా ఉండొచ్చని పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాల వారు ఎలాగైతే ఇక్కడ జీవనం సాగిస్తున్నారో, ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారో సీమాంధ్రులు అలాగే ఉండొచ్చని సూచించారు. తమ పోరాటమంతా తెలంగాణ, హైదరాబాద్ ఆస్తులను కొళ్లగొట్టిన సీమాంధ్రులపై మాత్రమేనని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ హైదరాబాద్‌పై ఆంక్షలను అంగీకరించబోమని తేల్చిచెప్పారు. హైదరాబాద్ శాంతిభద్రతలు గవర్నర్ చేతిలో పెట్టడమంటే తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఆయన అన్నారు. ఇలాంటి ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని సూచించారు. అలాగే కేంద్ర విద్యాసంస్థల్లో ఒపెన్ అడ్మిషన్ల ద్వారా తెలంగాణ ప్రాంత విద్యార్థులు, యువత అవకాశాలు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు అసెంబ్లీ ఎదురుగా గల గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ముసాయిదా బిల్లును ఉంచి అమరులకు ఘన నివాళులర్పించారు. కేసీఆర్‌తో భేటీ అయిన వారిలో టీఎన్‌జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, రఘు, రవీందర్‌రెడ్డి తదితరులున్నారు.