బిల్లు రాగానే కల్లు తాగిన కోతిలా బాబు : పొన్నం ఫైర్‌

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 13 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు అసెంబ్లీకి వచ్చిన విషయం తెలియగానే చంద్రబాబు కల్లు తాగిన కోతిలా ప్రవర్తించారని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. విభజన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ జాగీరా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని.. అసలు తెలంగాణ ఆయన అయ్య జాగీరా అని ధ్వజమెత్తారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. శుక్రవారం ఢిల్లీలో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు సొంత పార్టీ ఎంపీలను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. చంద్రబాబు తీరు దారుణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. వరంగల్‌ ఎంపీ రాజయ్య మాట్లాడుతూ, చంద్రబాబు సీమాంధ్ర ప్రాంత పక్షపాతిలా వ్యవహరిస్తున్నాడని, ఆయన తీరు సరిగా లేదని పేర్కొన్నారు. ఇదిలావుంటే అనూహ్యంగా తెలుగుదేశం సీమాంధ్ర ప్రాంత పార్లమెంట్‌ సభ్యుల అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని సమాజ్‌వాది పార్టీ(ఎస్పీ) నిర్ణయించింది. సీమాంధ్ర కాంగ్రెసు పార్టీకి చెందిన ఆరుగురు, సీమాంధ్ర టిడిపికి చెందిన నలుగురు, వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఇటీవల అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. వారు మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా వారు ఎస్పీని కూడా కలిశారు. అవిశ్వాసానికి మద్దతిస్తామని టిడిపికి హామీ ఇచ్చింది. ఎస్పీ విభజనకు విముఖంగా ఉందని, దీంతో ములాయం మద్దతు పలకవచ్చునని మొదటి నుండి అందరూ భావించారు. ఎస్పీకి 21 మంది ఎంపీల మద్దతు ఉంది. ఎస్పీ, శివసేన, అకాలీదళ్‌, బిజెడిలు మద్దతిచ్చేందుకు ముందుకు వచ్చాయి. తమను సంప్రదించకుండా లోక్‌పాల్‌ బిల్లు పైన ముందుకు వెళ్లడం ఎస్పీకి ఆగ్రహం కలిగిస్తోందని సమాచారం. తాము ధరల పెరుగుదల, అంతర్గత భద్రత పైన కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టామని సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎంపీలు చెప్పారు. తాము అవిశ్వాసం పెట్టింది తెలంగాణ అంశంపై కాదన్న విషయాన్ని బిజెపి గుర్తించాలని కోరారు. తమ అవిశ్వాసానికి మద్దతివ్వాలన్నారు.