నీలం గొప్ప ప్రజాస్వామికవాది
శత జయంత్యుత్సవాల్లో రాష్ట్రపతి ప్రణబ్
అనంతపురం, డిసెంబర్ 23 (జనంసాక్షి) :
నీలం సంజీవరెడ్డి విలువలు కలిగిన రాజకీయవేత్త అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఎన్నో పదవులు ఆయన చేపట్టినా ఎక్కడా తను రాజీపడలేదని, అలాగే ఉన్నత విలువలకు ప్రాధాన్యం ఇచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. నీలం జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని రాష్ట్రపతి అన్నారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన సంజీవరెడ్డి శతజయంతి ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న ప్రణబ్ మాట్లాడుతూ అతి పిన్న వయసులో అఖిలభారత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత సంజీవరెడ్డిదేనన్నారు. లక్ష్యం కోసం పని చేస్తే విజయాలు వెతుక్కుంటూ వస్తాయని నీలంను చూస్తే అర్థమవుతుందన్నారు. సంజీవరెడ్డి రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించారన్నారు. ప్రభుత్వంలో, రాజకీయాల్లో ఆదర్శప్రాయుడన్నారు. మచ్చలేని రాజకీయ మగధీరుడని, కూడు, గుడ్డ, వైద్యం కోసం అనేక చర్యలు చేపట్టారని తెలిపారు. స్పీకర్‌గా ఆయన నెలకొల్పిన విలువలు నేటికీ అనుసరణీయమన్నారు. 1977-82 మధ్య భారత రాష్ట్రపతిగా, ఆంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా అనేక పదవులు చేపట్టారన్నారు. లోక్‌సభకు ఎన్నికైన తొలిసారే స్పీకర్ బాధ్యతలు చేపట్టారని, స్పీకర్ పదవి ప్రాధాన్యత గుర్తించి స్పీకర్ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పార్టీ పదవికి రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. లోక్‌సభ స్పీకర్‌గా ప్రజాస్వామ్య సంప్రదాయాలను గౌరవించి ఆనాడు ఉన్న ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన రోజే లోక్‌సభ, రాజ్యసభ లను ఒకే చోట సమావేశ పరిచి చర్చించారని గుర్తు చేశారు. దేశంలోనే అత్యంత గుర్తింపు పొందిన నాయకుడు నీలం సంజీవరెడ్డి అని అన్నారు. నీలంకు అనేక ప్రత్యేక గుర్తింపులు ఉన్నాయని, రికార్డులు సాధించారన్నారు. రాష్ట్రపతిగా, రెండుసార్లు సిఎంగా, స్పీకర్‌గా ఇన్ని పదవులు చేపట్టిన ఏకైక భారతీయుడు నీలం మాత్రమేనన్నారు. లోకసభ స్పీకర్‌గా నీలం సంప్రదాయాలు పాటించారన్నారు. అవిశ్వాసం సమయంలో సభను చర్చకు పెట్టి సభా సంప్రదాయం పాటించారన్నారు. మద్రాసు రాష్ట్రంలో కూడా మంత్రిగా పని చేసిన చరిత్ర ఆయనకు ఉందన్నారు. దేశ స్వాతంత్రం కోసం నీలం చదువును వదులుకున్నారన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకు వెళ్లారన్నారు. నీలం చిన్నప్పటి నుంచి జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో పని చేశారన్నారు. దేశంలో ఉన్న వెనుకబడిన జాతుల కోసం తొలిసారిగా సంక్షేమ కమిటీని వేసిన ఘనత సంజీవరెడ్డిదేనన్నారు. హైదరాబాద్, ఆంధ్రరాష్ట్రం కలిపి ఆంధప్రదేశ్‌గా ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి రాష్ట్ర అభివృద్ధికి అనేక ప్రణాళికలు రూపొందించారన్నారు. ఈతరం రాజకీయ నాయకులకు నీలం సంజీవరెడ్డి స్ఫూర్తి అని గవర్నర్ నరసింహన్ అన్నారు. సంజీవరెడ్డి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న గవర్నర్ మాట్లాడుతూ… సంజీవరెడ్డి గొప్ప రాజకీయ వైతాళికుడని కొనియాడారు. అనంతపురంతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గవర్నర్ గుర్తు చేసుకున్నారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి దేశానికే గర్వకారణమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. నీలం సంజీవరెడ్డి శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ఏ పదవి అలంకరించినా సంజీవరెడ్డి ఆ పదవికి వన్నె తెచ్చారన్నారు. సంజీవరెడ్డి వేసిన పునాదిరాళ్ల వల్ల నేడు 60లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. రైతుల సంక్షేమం కోసం ఆయన దూరదృష్టితో ఆలోచించారని అన్నారు. ఆయన తొలి ముఖ్యమంత్రిగా చేసిన సేవలు మరువలేనివన్నారు.ఈ సందర్భంగా నీలం సంజీవరెడ్డి సహచరులను రాష్ట్రపతి చేతులవిూదుగా సత్కరించారు. సంజీవరెడ్డి శతజయంతి సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు రాష్ట్రపతి బహుమతులు అందజేశారు. కాగా, రాష్ట్ర ప్రజలకు ప్రణబ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురంలో జరిగిన నీలం సంజీవరెడ్డి శతజయంతి ముగింపు ఉత్సవాల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి, మంత్రులు శైలజానాథ్, రఘువీరారెడ్డి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వాయుసేన విమానంలో అనంతపురం జిల్లా పుట్టపర్తి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలిక్టాపర్‌లో అనంతపురం బయలుదేరారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.