అభిప్రాయాలు లిఖిత పూర్వకంగా తీసుకోవడమే మేలు
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ ముసాయిదా-2013పై రాష్ట్ర శాసనసభ, శాసన మండలి అభిప్రాయాలు తెలిపేందుకు రాష్ట్రపతి ఇచ్చిన 40 రోజుల గడువులో 25 రోజులు గడిచాయి. ముసాయిదా రాష్ట్రానికి చేరిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీ డిసెంబర్ ఐదు రోజులు, జనవరిలో నాలుగు రోజులు మొత్తంగా తొమ్మిది రోజుల పాటు సాగింది. శాసనసభ, మండలిలో డిసెంబర్ 16న ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లు రాష్ట్రానికి రాకపూర్వమే ఉభయ సభల్లో మొదలైన లొల్లి బిల్లు సభలో ప్రవేశపెట్టిన తర్వాత తారస్థాయికి చేరింది. సీమాంధ్ర నేతలు ప్రజాప్రతినిధులమనే ఇంగితాన్ని మరిచి సభా గౌరవాన్ని మంటగలిపేలా ప్రవర్తించారు. డిసెంబర్‌లో బిల్లు పెట్టాక మూడు రోజుల పాటు సభ నిర్వహించగా ఒక్క నిమిషం కూడా ఒక్క సభ్యుడు మాట్లాడింది లేదు. రాష్ట్ర విభజన వద్దే వద్దంటూ సీమాంధ్రులు సభా కార్యక్రమాలకు అడ్డు తగలుగడం మినహా సభలో మరో సీన్ కనిపించడం లేదు. డిసెంబర్ 20 వరకు శాసనసభ, మండలి నిర్వహించాల్సి ఉండగా ఉభయ సభలను ఒక్కరోజు ముందుగానే వాయిదా వేశారు. తిరిగి జనవరిలో ముసాయిదాపై చర్చించేందుకు రెండు విడతల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు స్పీకర్, శాసన మండలి చైర్మన్లు ప్రకటించారు. జనవరి 3న ప్రారంభమైన ఉభయ సభల్లోనూ అదే గందరగోళం. బిల్లు రాష్ట్రపతికి పంపాల్సిన సమయం దగ్గరపడుతున్నా సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పద్ధతి మార్చుకోవడం లేదు. సభలో ముసాయిదాపై చర్చించడానికి ససేమిరా అంటున్నారు. మొన్నటిదాక వీరితో గొంతు కలిపిన సీఎం కిరణ్ సహా కొందరు మంత్రులు, ఇతర నేతలు ఇప్పుడు బిల్లుపై చర్చించకుంటే సీమాంధ్రకే నష్టమని అంటున్నారు. ఆలస్యంగా వాస్తవాన్ని గుర్తించిన వారు ఇదే విషయాన్ని సహచరులకు చెప్పి చర్చకు మాత్రం ఒప్పించడం లేదు. ముసాయిదాపై శాసనసభ, మండలి అభిప్రాయాలు చెప్పడానికి మరో రెండు వారాల వ్యవధి మాత్రమే ఉన్నా సభలోని గందగోళ పరిస్థితులు చర్చ వైపు మళ్లేలా కనిపించడం లేదు. ముసాయిదాపై చర్చ జరపాలని సీఎం ఆలస్యంగా గుర్తించగా, స్పీకర్ తన వంతుగా సోమవారం రెండు పర్యాయాలు బీఏసీ సమావేశాలు నిర్వహించారు. గంటల తరబడి సాగిన బీఏసీ సమావేశాల్లో ముసాయిదాపై చర్చకు ఏకాభిప్రాయం మాత్రం సాధించలేకపోయారు. ప్రభుత్వంతో పాటు బీజేపీ, సీపీఐ, టీఆర్‌ఎస్, సీపీఎం, ఎంఐఎం చర్చ జరపాలని కోరగా వైఎస్సార్ సీపీ మాత్రం సమైక్య తీర్మానం తర్వాతనే చర్చకు అంగీకరిస్తామని తెలిపింది. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం ఒక్కటి కాదు రెండు కాదు ఐదు అభిప్రాయాలు చెప్పింది. తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు చర్చ జరగాలని కోరగా, సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం నోటికి వచ్చిన అభిప్రాయం వెల్లడించారు. గాలి ముద్దుకృష్ణమ సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు రాష్ట్ర శాసనసభకు చేరుకోవడానికి పూర్వమే సీమాంధ్ర పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమంటూ ప్రకటనలు చేశాయి. గతంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశాల్లో తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా మాట్లాడిన విషయాన్ని విస్మరించి పూర్తిగా అడ్డం తిరిగాయి. ఆంధ్రప్రదేశ్ విభజన క్లిష్టమైనదని, కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇందుకు పూనుకుందని ఆరోపణలు గుప్పించాయి. దురదృష్టవశాత్తు ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలు కూడా అలాంటి ఆరోపణలే చేశారు. ముఖ్యమంత్రి ఇంకో అడుగు ముందుకేసి పరోక్షంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీనే నిందించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ ముసాయిదాపై అసెంబ్లీలో చర్చ గడువు ముగిసేలోగానైనా ప్రారంభమవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ ఇది వరకు విభజన జరిగిన బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సభ్యుల అభిప్రాయాలకు సేకరించిన విధానాన్నే ఇక్కడా ముందుకు తీసుకువచ్చారు. సభ్యులంతా శుక్రవారం మధ్యాహ్నంలోగా ముసాయిదాలో ఏవైనా సవరణలు చేయదలిస్తే వాటిని తాము అందజేసే నిర్దేశిత ఫార్మాట్‌లో సమర్పించాలని కోరారు. సభ్యులు అందజేసే సవరణలను అసెంబ్లీకి ఓటింగ్‌కు పెడతామని స్పీకర్ చెప్పారు. ఒకవేళ సభలో బిల్లుపై చర్చ సాధ్యం కాని పరిస్థితుల్లో సభ్యులు అందజేసే సవరణ ప్రతిపాదనలే వారి అభిప్రాయంగా తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ సభలో కనుక చర్చ జరుగకపోతే డీమ్డ్ టు ఆన్సర్ పద్ధతిన చివరి రోజు ఈనెల 23న చర్చించే అవకాశమే ఉండదు. అది సీమాంధ్ర ప్రజలకు పెద్ద దెబ్బే. వారికి డిమాండ్లేమిటో కూడా శాసనసభ, మండలి పరంగా కేంద్రానికి నివేదించే ఉన్న అవకాశం ఉన్నా దాన్నీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కోల్పోక తప్పదు. గుడ్డిగా తెలంగాణ బిల్లును అడ్డుకోవడం ద్వారా తాము వద్దన్న ముసాయిదాను కేంద్రం ఆమోదించిందనే ఆపవాదును కాంగ్రెస్‌కు అంటగట్టి తాము సీమాంధ్ర ప్రాంతంలో రాజకీయ లబ్ధి పొందాలన్నది ఆ ప్రాంత ప్రతినిధుల ఆశ. కానీ వారిది అత్యాశే. ముసాయిదాపై చర్చకు అవకాశం ఉన్న ఏడు రోజుల విలువైన సభా సమయాన్ని నిరసనల పేరుతో వృథా చేసి తీరా సయమానికి తమకు ఇంకా సమయం కావాలని కోరినా ప్రయోజనముండదు. సీమాంధ్ర ప్రతినిధులు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా ఇచ్చి వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడమో.. హెచ్చు మంది సభ్యుల ఆమోదంతో చర్చకు ఉపక్రమించడమో చేయాలి. పుణ్యకాలం గడిస్తే ఇక ఏం చేసినా ప్రయోజనముండదు. సీమాంధ్రులు ఇకనైనా తమ తీరు మార్చుకోవాలి. చట్టసభలపై విశ్వాసంతో మెలగాలి. ఇలాగే వ్యవహరిస్తే వారికి చట్ట సభలపై గౌరవమే లేదనుకోవాల్సి వస్తుంది. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్రులకు ఏం కావాలో కోరాలి. వాటిని నెరవేర్చడానికి కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. నిర్దిష్టమైన హామీ పొందాలి. ఇలాంటి పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామంటూ ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలు పలకడం చచ్చిన శవాన్ని బతికిస్తామనడమే. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఇకనైనా మారకుంటే అక్కడి ప్రజలే వారిని తరిమికొట్టడం ఖాయం.