ప్రధాని ఎవరన్నది కాదు..


దేశానికి ఏం చేస్తామన్నది ప్రధానం
కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌
షిర్పూర్‌, మార్చి 5 (జనంసాక్షి) :
ప్రధాని ఎవరన్నది ముఖ్యం కాదని దేశానికి ఏం చేశారన్నదే ప్రధానమని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. తాను ప్రధానిని అవుతానా లేదా అన్న విషయానికి అంత ప్రాధాన్యత లేదన్నారు. మహారాష్ట్రలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్‌ స్థానిక ఇంజినీరింగ్‌ కళాశాలలో గిరిజన యువతులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్‌ ప్రధాని కావాలంటూ ఓ యువకుడు అభినందలు తెలుపగా రాహుల్‌ దానిపై స్పందించారు. ప్రధాని పదవి ముఖ్యం కాదని ప్రతి ఒక్కరు ఈ దేశం తమదనే భావన కలిగి ఉండాలన్నారు. మహిళలు, యువతీయువకులు ఈ భావన కలిగిఉండటమే ముఖ్యమన్నారు. రాజకీయాల్లోకి రావాలంటూ ఈ సందర్భంగా యువతను రాహుల్‌ ఆహ్వానించారు. సొంత దేశంలో భయంతో బతుకుతున్నానని ఒక్క యువకుడు అనలేని పరిస్థితి రవాలని ఆయన ఆకాంక్షించారు. వచ్చే పదేళ్లలో ఇక్కడి యువతీ యువకులే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కావాలని, ప్రధాని అయితే ఇంకా మంచిదని అన్నారు. ఆత్మవిశ్వాసం లేని జర్మనీ నియంత అడల్ఫ్‌ హిట్లర్‌ కేకలు పెట్టేవారని, మహాత్మాగాంధీ ఎప్పుడైనా కేకలు పెట్టారా అని ప్రశ్నించారు. ఏ విషయాన్నైనా అధికారంతో కాకుండా ప్రేమతో చెప్పవచ్చన్నారు. ఇలా చేస్తే విద్యార్థుల్లోంచే ఎందరో రాహుల్‌గాంధీలు కావొచ్చని తెలిపారు. యువతకు తానిచ్చే సందేశం ఒక్కటేనని యువతలో ఉన్న ప్రతిభా సామర్థ్యాలు ప్రపంచంలో మరెవ్వరికీ లేవని రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థలో మార్పునకు పాటు పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.