విలీనం కాకున్నా ఫరక్‌ పడదు


పొత్తులపై కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నాం : దిగ్విజయ్‌సింగ్‌
న్యూఢిల్లీ, మార్చి 5 (జనంసాక్షి) :
టీఆర్‌ఎస్‌ తమ పార్టీలో విలీనం కాకున్నా ఏం ఫరక్‌ పడదని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. కాంగ్రెస్‌లో విలీనం చేయాలా వద్దా అన్నది టీఆర్‌ఎస్‌ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉందని ఆయన అన్నారు. విలీనం ఉన్నా లేకపోయినా రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్‌ విజయం సాధించి, ఇరు ప్రాంతాల్లో ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ ఏర్పాటు చేస్తుందని అన్నారు. అయితే తెలంగాణ వచ్చాక టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆర్‌ చెప్పారని అన్నారు. విలీనాన్ని తిరస్కరించడం ఆ పార్టీ ఇష్టమని, దానిపై తామేమీ వ్యాఖ్యానించ దల్చుకోలదన్నారు. ఇతర పార్టీలతో పొత్తుపై టీఆర్‌ఎస్‌ వేసిన కమిటీని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలలో కాంగ్రెస్‌ గెలుపొందుతుందని దిగ్విజయ్‌ సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో ఆయన బుధవారం విూడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌ లో విలీనం చేస్తామని సోనియాకు చెప్పిన కెసిఆర్‌ ఇప్పుడు మాటమార్చారని చెప్పారు. ఎన్నికల పొత్తుకు ఎప్పటికీ ద్వారాలు తెరిచే ఉంటాయన్నారు. ఎన్నికల్లో హింసకు తావులేదన్నారు. ప్రజాస్వామ్యం బలంగా ఉంటే దేశం శాంతియుతంగా ఉంటుందని చెప్పారు. ఈ ఎన్నికల షెడ్యూల్‌ దేశ చర్రితలోనే సుదీర్ఘమైనదన్నారు. తక్కువ సమయం వల్ల ఈసీకి ఈ ఎన్నికలు కొంచెం కష్టంగా మారుతాయని పేర్కొన్నారు. తెలంగాణ ఇస్తే విలీనం చేస్తామని ఆ పార్టీయే చెప్పిందన్నారు. టిఆర్‌ఎస్‌ నిర్ణయాలు తమపై ఎలాంటి ప్రభావం చూపవన్నారు. విలీనాన్ని తిరస్కరించడం టిఆర్‌ఎస్‌, కెసిఆర్‌ ఇష్టమని, దానిపై తాము ఏమీ మాట్లాడమని చెప్పారు. ఇదిలావుంటే దిగ్విజయ్‌ సింగ్‌తో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిలు భేటీ అయ్యారు. తెలంగాణకు ప్రత్యేక పిసిసిని ఏర్పాటు చేయాలని తెలంగాణ నేతలు డిగ్గీని కోరారు. కాగా, కెసిఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను దిగ్విజయ్‌ సింగ్‌ శాంత పర్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత తరుణంలో కాస్త సంయమనం పాటించాలని, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా మార్గనిర్దేశం మేరకు ముందుకు సాగుదామని సూచించారు. దిగ్విజయ్‌ సింగ్‌తో షబ్బీర్‌, జానారెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. కెసిఆర్‌ వ్యాఖ్యలను, దిగ్విజయ్‌ దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ విషయాలన్నింటినీ సోనియా దృష్టికి తీసుకువెళ్తానని, అంతవరకు సంయమనం పాటించాలని సూచించారు. తెరాసతో కాంగ్రెస్‌ సంబంధాల గురించి ప్రస్తుతానికి మరిచిపోయి ప్రజల్లోకి వెళ్లాలని, మునిసిపల్‌ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించాలని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలకు దిగ్విజయ్‌ చెప్పారు.