గుజరాత్ అభివృద్ధి బూటకం
వికాసం కాదు వినాశనమే
అంబానీ, అద్వానీలే వృద్ధి సాధించారు
ఆప్ కో ఆర్డినేటర్ కేజ్రీవాల్
భుజ్, మార్చి 6 (జనంసాక్షి) :
గుజరాత్ అభివృద్ధి బూటకమని ఆమ్ ఆద్మీ పార్టీ కో ఆర్డినేటర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. గుజరాత్‌లో వికాసం లేదని వినాశనమే అంతటా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. గుజరాత్‌లో అభివృద్ధిపై నిజనిర్దారణ కోసం పర్యటిస్తున్న కేజ్రీవాల్ మాట్లాడారు. నరేంద్రమోడీ బూటకపు ప్రచారంతో దేశ ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. గుజరాత్‌లో రిలయన్స్ అంబానీ, బీజేపీ అగ్రనేత అద్వానీలే వృద్ధి సాధించారని ఆరోపించారు. మరోవైపు బుధవారం ఆప్ కార్యకర్తల తీరుపై కేజ్రీవాల్ క్షమాపణ చెప్పారు. తనను పోలీసులు నిర్బంధించినందుకు నిరసనగా ఢిల్లీ, లక్నో నగరాల్లో ఆప్ కార్యకర్తలు వ్యవహరించిన తీరు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరైనా అహింసకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా మాట్లాడుతూ, గుజరాత్‌లోని మోడీ సర్కారు తనపై గూఢచర్యానికి పాల్పడుతోందని ఆరోపించారు. తనను పోలీసులు ఇబ్బందుల పాల్జేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాని తెలిపారు.