భాజపాలోకి పురందేశ్వరి
న్యూఢిల్లీ, మార్చి 7 (జనంసాక్షి) :
కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె భర్త పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, పార్లమెంటరీ పక్షనేత సుష్మాస్వరాజ్ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బేషరతుగా బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. ఏ బాధ్యత అప్పగించినా శిరసావహిస్తానని అన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ సేవలవల్లగానీ, పరిచయంవల్ల గానీ, తన పదేళ్ల పదవికాలంలో తన పనితీరు చూసిగానీ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విభజన నేపథ్యంలో జరిగిన పరిణామాలన్నీ ప్రజలందరికి తెలిసినవే. సమైక్యంగానే ఉంటేనే బాగుంటుందని భావించాను. అయితే, అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పార్టీ సభ్యురాలిగా ఆ నిర్ణయాన్ని సమర్థించాను. అయితే, సీమాంధ్రులకు మేలు కలిగే విధంగా కొన్ని ప్రతిపాదనలు జీవోఎం ఎదుట ఉంచాను. అయితే, వాటిలో కొన్ని స్వీకరించారు.. మరికొన్నింటిని తిరస్కరించారు. ఇంకొన్నింటిని అసలు పట్టించుకోలేదు. దాంతో బాధేసింది. వెంటనే తన పదవికి రాజీనామా చేసి రాజీనామా పత్రాన్ని స్వయంగా సోనియాకు అందజేశారు. ఆ తర్వాత లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన తీరు, రాజ్యసభలో పొందిన తీరు అందరికీ తెలిసిందే. వెంకయ్య నాయుడు ఉండడంవల్ల కొన్నింటిని సాధించుకోవడం సాధ్యమైంది. ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీని వీడాలని, రాజకీయాల నుంచి వైదొలగాలని తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు తదితరులతో కలిసి నిర్ణయాన్ని వెల్లడించాను. అయితే, ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో నిలదొక్కుకుంటున్నందున మరికొన్ని రోజులపాటు రాజకీయాల్లో కొనసాగాలని కోరారు. దాంతో పునరాలోచనలో పడ్డాను. సీమాంధ్ర ప్రాంత ప్రజలకు మేలు చేయాలంటే జాతీయ పార్టీతో ఉంటేనే సాధ్యమవుతుందని భావించా.. ఆ మేరకు శుక్రవారం ఢిల్లీకి చేరుకుని బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, అగ్రనేత ఎల్‌కె అద్వానీ, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీలను వెంకయ్య నాయుడు నేతృత్వంలో కలిశాను. వారితో అభిప్రాయాన్ని తెలియజేశాను. వారు స్వాగతించారు అని తెలిపారు. అనంతరం బిజెపి అగ్రనేత వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, జరిగిందేదో జరిగిపోయింది.. ఇక జరగాల్సింది చూడడమే తక్షణ కర్తవ్యం. పురందరేశ్వరిని పార్టీలోకి స్వాగతిస్తున్నాం.. ప్రజాదరణ గల నాయకులను బిజెపి ఆహ్వానిస్తోంది. ప్రజలు మూడు విషయాలపట్ల ఆలోచిస్తున్నారు. హామీలు ఎవరు నెరవేర్చగలరు, ఎవరికి సమర్థత ఉంది, అధికారంలోకి వచ్చే అవకాశం ఎవరికి ఉంది అన్న దానిపై చర్చించుకుంటున్నారు. అవన్నీ బిజెపికే ఉన్నట్టు గుర్తించారు. నరేంద్ర మోడీవల్ల అవన్నీ నెరవేరుతాయని భావిస్తున్నారు. మోడీనే కోరుకుంటున్నారు. మోడీ నేతృత్వంలో అభివృద్ధి జరగడం ఖాయం.. మోడీ ప్రధాని కావడం తధ్యమని వెంకయ్య నాయుడు అన్నారు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందిన తీరు విచారకరం.. అంతా హడావుడి.. గందరగోళం మధ్య చుట్టేశారు. బిజెపి పట్టుబట్టి రాజ్యసభలో పోరాడడంవల్ల ఆ మాత్రమైనా మేలు జరిగింది.. అనేక అంశాలను సాధించగలిగాం. పదేళ్ళపాటు నానబెట్టి హడావుడిగా బిల్లును ఆమోదింపజేసుకున్నారు. జరిగిందేదో జరిగిపోయింది. సీమాంధ్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు బిజెపి అధికారంలోకి రాగానే మేలు చేకూరుస్తాం అని వెంకయ్య నాయుడు అన్నారు. తెలంగాణలోనూ, సీమాంధ్రలోనూ సమర్థవంతమైన పాలన రావాలని.. కావాలని ఆయన ఆకాంక్షించారు.