పొత్తుల కమిటీతో చర్చలు కొనసాగుతాయి
కేకేతో భేటీ అవుతాం : దిగ్విజయ్
న్యూఢిల్లీ, మార్చి 8 (జనంసాక్షి) :
టీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన పొత్తుల కమిటీతో చర్చలు కొనసాగుతాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. త్వరలోనే కె. కేశవరావుతో భేటీ అవుతామని ఆయన చెప్పారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుపై సంప్రదింపులు కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ నేతలు సమావేశం పెట్టుకుని పొత్తులకు వెంపర్లాడడం లేదని జానారెడ్డి తదితరలు చేసిన ప్రకటన సమయంలోనే దిగ్విజయ్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ పార్టీ నేత కె.కేశవరావుతో చర్చల తర్వాత పొత్తుపై ఓ అవగాహనకు వస్తామని దిగ్విజయ్ చెప్పారు. రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధప్రదేశ్‌లకు ప్రత్యేక పీసీసీలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. పీసీసీల ఏర్పాటుపై చర్చలు తుదిదశలో ఉన్నాయని వెల్లడించారు. కాంగ్రెస్‌ను వీడనని, కొత్త పార్టీ పెట్టనని కిరణ్‌కుమార్ రెడ్డి గతంలో తనతో చెప్పారన్నారు. అయితే ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదైనా చేసుకునే స్వేచ్ఛ ఉందన్నారు. ఇదిలావుంటే మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి దిగ్విజయ్‌సింగ్ సూటి ప్రశ్న సంధించారు. తెలంగాణను ఇవ్వడమే తప్పైతే, బిల్లుకు మద్దతిచ్చిన భారతీయ జనతా పార్టీలో ఆమె ఎలా చేరుతారని డిగ్గీ ప్రశ్నించారు. దీనికి ఆమె వివరణ ఇవ్వాల్సిన అవసరముందన్నారు. కాంగ్రెసు పార్టీలో ఆమెకు సముచిత స్థానం ఇచ్చామని చెప్పారు. పార్టీలోకి తీసుకుని రావడమే గాకుండా రెండుసార్లు గెలిపించి మంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్‌దన్నారు. విభజనకు సహకరించిన బిజెపిలో చేరడాన్ని ఆమె ఎలా సమర్థించుకుంటారో చెప్పాలన్నారు. ఏడెనిమిదేళ్లు పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీలు మారారని మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరిన కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరిపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ కూతురై ఉండి కూడా ఆయన స్థాపించిన టిడిపిని వదిలి కాంగ్రెస్ పార్టీలో ఏ లాభాపేక్షతో చేరారని ప్రశ్నించారు. ఇప్పుడు మరే ఉద్దేశంతో బిజెపిలో అడుగుపెట్టారని నిలదీశారు. పురంధేశ్వరి నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇదిలావుంటే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు మేరకు మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. పీసీసీ మాజీ చీఫ్ బొత్స ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్ర విభజన పూత్తెన నేపథ్యంలో తెలంగాణ పీసీసీని హైకమాండ్ ఖరారు చేయనున్నట్లు సమాచారం.