ఎంపీ, ఎమ్మెల్యేల కేసులు ప్రతిరోజూ విచారించాలి : సుప్రీం
న్యూఢిల్లీ, మార్చి 10 (జనంసాక్షి) :
ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులను ప్రతిరోజూ విచారించాలని సుప్రీం కోర్టు పేర్కొంది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల విచారణను ఏడాదిలోగా పూర్తి చేయాలని సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ సత్వరం ముగిస్తే సదరు ప్రజాప్రతినిధి తప్పు చేసినట్లు రుజువైతే అనర్హత వేటు వేసేందుకు, నిర్దోషులైతే వారు కేసు నుంచి విముక్తమవడానికి సత్వర విచారణ దోహద పడుతుందని పేర్కొంది. ఇది అందరికీ ఉపయోగకరమని జస్టిస్ ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసం తీర్పు చెప్పింది. ఇలాంటి కేసులు ఏడాది లోపు విచారణ పూర్తికాకుంటే సంబంధిత జడ్జీలు ఆయా కారణాలను వివరిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తప్పనిసరిగా సమాచారమివ్వాలని ఆదేశించింది. నేరపూరిత రాజకీయాలకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరుతూ పబ్లిక్ ఇంట్రస్ట్ ఫౌండేషన్ అనే ఎన్‌జీవో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. ప్రజాప్రాతినిథ్య చట్టంలో పేర్కొన్న అంశాలకు సంబంధించిన నేరాలపై ఇక నుంచి ఏడాదిలోపు విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది.