వారికి ఉరే సరి
నిర్భయ నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ, మార్చి 13 (జనంసాక్షి) :
దేశంలోనే సంచలనం సృష్టించిన నిర్భయపై దారుణ అత్యాచారం, హత్య కేసులో నిందితులకు ఉరిశిక్షే సరైనధని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. నిర్భయ కేసులో ఢిల్లీ హైకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. నలుగురు నిందితులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు విధించిన మరణశిక్షను ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు తన తీర్పును గురువారం మధ్యాహ్నం వెలువరించింది. ఇదిలాఉండగా నిర్భయ కేసులో నిందితులైన ఆ నలుగురికి ఫాస్ట్‌ట్రాక్‌కోర్టు మరణశిక్ష విధిస్తున్నట్టు సెప్టెంబర్ 13,2013న తీర్పు వెలువరించడం తెలిసిందే. దీంతో నిందితులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం విదితమే.
2012, డిసెంబర్ 16న..
నిర్భయపై 2012, డిసెంబర్ 16న ఆరుగురు యువకులు కదులుతున్న బస్సులో ఘాతుకానికి ఒడిగట్టడం తెలిసిందే. ఢిల్లీ నడి వీధుల్లో జరిగిన ఈ దారుణం యావత్ జాతిని కదిలించింది. నిర్భయపై అఘాయిత్యాన్ని అడ్డుకున్న ఆమె స్నేహితుడ్ని సైతం కొట్టి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నగుస్తున్న బస్సులో నుంచి వారిని తోసేయడం.. పెట్రోలింగ్ పోలీసులు కొన్ని గంటల తర్వాత వారిని గుర్తించి ఆసుపత్రికి చేర్చిన విషయం విదితమే. మెరుగైన చికిత్స కోసం నిర్భయను డిసెంబర్ 26న సింగపూర్ తరలించగా ఆమె డిసెంబర్ 29న కన్నుమూశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. అప్పట్లో మహిళా సంఘాలు, యువత దేశ వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు. నిర్భయ కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను ఉరి తీయాలని నినదించడం తెలిసిందే. ఇదిలా ఉండగా నిర్భయ కేసులో ఆరుగురు నిందితులు కాగా వారిలో ప్రధాన నిందితుడైన రాంసింగ్ తీహార్ జైలులో 2013, మార్చి 11న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో నిందితుడు మైనర్ కావడంతో జువైనెల్‌హోంలో శిక్షను అనుభవిస్తున్నాడు. అతనికి మూడేళ్ల శిక్ష విధించడం విదితమే. అక్షయ్ కుమార్, పవన్, ముఖేష్, వినయ్‌శర్మలను 13 నేరాలకు సంబంధించి దోషులుగా గుర్తిస్తూ కోర్టు 2013, సెప్టెంబర్ 10న తీర్పునిచ్చింది. సెప్టెంబర్ 13న నలుగురు దోషులకు మరణశిక్ష విధించింది. నిందితులు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లడం తెలిసిందే. నిర్భయ కేసులో ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును జాతీయ మహిళా కమిషన్ స్వాగతించింది. దేశ ప్రజలు ఈ తీర్పు కోసమే ఎదురుచూస్తున్నారని ఎన్‌సీడబ్ల్యూ చైర్ పర్సన్ మమత శర్మ హర్షం వ్యక్తం చేశారు.