టిఆర్‌ఎస్‌, సిపిఐల మధ్య కుదిరిన పొత్తు

ఆదిలాబాద్‌, మార్చి 15  : పురపాలక సంఘాల ఎన్నికలలో ఎట్టకేలకు టిఆర్‌ఎస్‌, సిపిఐ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. గత వారం రోజులుగా పొత్తుల విషయమై ఇరుపార్టీల నాయకులు చర్చలు జరుపుతున్నారు. నామినేషన్ల చివరి రోజు పొత్తుపై అంగీకారం కుదిరింది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు గాను ఆదిలాబాద్‌, మంచిర్యాల బెల్లంపల్లి మున్సిపాలిటీలలో టిఆర్‌ఎస్‌ పార్టీ సిపిఐతో పొత్తు పెట్టుకుంది. ఆదిలాబాద్‌లో 3వార్డులను బెల్లంపల్లిలో ఎనిమిది వార్డులను, మంచిర్యాలలో ఒక వార్డును టిఆర్‌ఎస్‌ పార్టీ సిపిఐ పార్టీకి కేటాయించింది. పురపాలక సంఘాల ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌తో పొత్తు కుదరడంతో ఇరుపార్టీల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కూడా ఈ విధంగానే ఇరుపార్టీలు కలిసి పోటీ చేస్తాయని టిఆర్‌ఎస్‌ నాయకులు, సిపిఐ నాయకులు పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఇరుపార్టీల అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని వారు కోరారు.