చైర్మన్ అభ్యర్థులపేర్లను ముందుగా ప్రకటించండి
ఆదిలాబాద్, మార్చి 15 : జిల్లాలోని పురపాలక సంఘాల ఎన్నికల్లో చైర్మన్ పదవులను కైవసం చేసుకునేందుకు అన్ని రాజకీయపార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. నామినేషన్ల పర్వం పూర్తికావడంతో ప్రచారంపై దృష్టి సారించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలను మహిళలకు కేటాయించడంతో ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధ్యక్ష పదవిని చేజిక్కించుకోవడానికి ప్రధానపార్టీలు ధీటైన అభ్యర్థులను రంగంలోకి దింపారు. ఈ పురపాలక ఎన్నికల్లో ప్రధానంగా టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపిల మధ్యే పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల కారణంగా పదవులను ఆశించిన నాయకులు ఈ ఎన్నికలలో తమ కుటుంబంలోని మహిళలను రంగంలోకి దించి చైర్మన్ పదవిని సాధించేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో 189వార్డులకు గాను 95వార్డులను మహిళలకు రిజర్వు చేశారు. రిజర్వు చేసిన వార్డులతో పాటు జనరల్ వార్డులనుంచి కూడా మహిళలు పెద్ద ఎత్తున పోటీలోకి రావడంతో జనరల్ స్థానాల్లోని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఐదు మున్సిపాలిటీలలో మహిళలకు కేటాయించిన చైర్మన్‌పదవులకు అభ్యర్థులను ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముందుగా ప్రకటిస్తే ప్రజలకు తెలియడంతో పాటు పార్టీ పరంగా లాభం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. మరోవైపు అభ్యర్థుల పేర్లను ముందుగా ప్రకటిస్తే నష్టం జరుగుతుందని మరికొందరు వాదిస్తున్నారు. ఎన్నికలు పూర్తై ఫలితాలు వచ్చిన తరువాతే అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండడంతో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని చైర్మన్ పదవులకు పార్టీ ఎవరికి కేటాయిస్తే వారికి మద్దతు తెలిపాలని ఆయా పార్టీల నాయకులు సూచిస్తున్నారు. ఈ నెల 16న నామినేషన్లకు ఉపసంహరణ ఉండడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రత్యర్థులను మచ్చిక చేసుకునేందుకు రంగంలోకి దిగారు. స్వతంత్రంగా పోటీ చేస్తున్న అభ్యర్థులను ఉపసంహరించుకునేలా ఒత్తిడి పెంచారు.