మా రైతుల్ని ఆదుకోండి
తెలంగాణలో కరెంటు కోతలు ఎత్తేయండి
గవర్నర్‌ను కలిసిన టీఆర్‌ఎస్ బృందం
హైదరాబాద్, మార్చి 24 (జనంసాక్షి) :
విద్యుత్ కోతల బారి నుంచి తెలంగాణ రైతులను ఆదుకోవాలని టీఆర్‌ఎస్ ప్రతిని ధుల బృందం గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞ ప్తి చేసింది. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నేతృత్వంలో పార్టీ నేతలు సోమవారం గవర్నర్‌ను కలిసి విద్యుత్ కోతలతో తెలం గాణ రైతులు అనేక సమస్యలు ఎదుర్కొం టున్నారని వివరించారు. అనంతరం ఈటెల మీడియాతో మాట్లాడుతూ తెలం గాణ ప్రాంతంలో అడ్డు అదుపు లేకుండా విదిస్తున్న విద్యుత్
కోతల వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో 90 శాతం పంటలు వ్యవసాయ బావుల కిందనే సాగు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో అధికారులు విద్యుత్ సరఫరాను పట్టించుకోవడం లేదని అన్నారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈటెల డిమాండ్ చేశారు. అధికారులు విధిస్తున్న విద్యుత్ కోతలతో తెలంగాణ రైతుల కంటిమీద కునుకులేకుండాపోయిందని అన్నారు. కనీసం ఐదు గంటల పాటైనా విద్యుత్ సరఫరా జరగడం లేదని, దీంతో సాగుకు నీరు ఎలా సాధ్యమని ఆయన అన్నారు. అంతేగాక విద్యార్థుల పరీక్షలు జరుగుతున్న సమయంలో విద్యుత్ కోత విధిస్తున్నందున విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతున్నదని అన్నారు. ఎన్నికల కోడ్ నుంచి రైతులకు విద్యుత్ మినహాయింపు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సుమారు ఏడు గంటల పాటు రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని గవర్నర్‌ను కోరారు. విద్యుత్ సరఫరాను అత్యవసర సర్వీసుగా పరిగణించి, కోతలను ఎత్తివేసి రైతులను ఆదుకోవాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చివరి దశలో ఇచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపామన్నారు. పదవి నుండి ఎలాగో దిగిపోతానని తెలుసుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడి తన ఇష్టానుసారం ఫైళ్లపై సంతకాలు చేశారని, వాటిని తెలుసుకొని గవర్నర్ వెంటనే రద్దు చేయాలని కోరారు. వచ్చే విద్యాసంవత్సరంలో తెలంగాణ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలు, చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చాలని గవర్నర్‌ను కోరారు. తెలంగాణ ప్రాంతంలో అనేక మంది చరిత్రకారులు, కవులు సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల మరుగున పడిపోయారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో తిరిగి కవులు, చరిత్రకారుల జీవితచరిత్రలను తెలంగాణ విద్యార్థులకు తెలియచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈటెల గవర్నర్‌ను కోరారు. తెలంగాణలోని 10 జిల్లాల్లో రైతులు కంటిపై కునుకు లేకుండా ఉన్నారని ఇదే విషయాన్ని గవర్నర్ నరసింహన్‌కు తెలియజేశామని ఈటెల అన్నారు. రైతులకు 5 గంటల పాటు కూడా కరెంటు ఇవ్వడం లేదని 7 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించాలి. విద్యుత్ సరఫరాను ఎన్నికల కోడ్ నుంచి మినహాయించాలి. రైతులకు కరెంటు సరఫరా చేయడాన్ని అత్యవసర కర్తవ్యంగా పరిగణించాలి. తెలంగాణ సంస్కృతి, ఉద్యమ ఘట్టాలను పాఠ్యాంశాలుగా రూపొందించాలని కోరారు. కిరణ్ చివరి అంకంలో ఇచ్చిన జీవోలను రద్దు చేయాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు.