తెలంగాణ ఫలాలు అందరికీ దక్కాలి


పునర్నిర్మాణంలో మేం కీలకం
వాచ్‌ డాగ్‌లా పనిచేస్తాం
రాజకీయ పార్టీగా అవతరించం : కోదండరామ్‌
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (జనంసాక్షి) :తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఆకాం క్షించారు. పది జిల్లాల్లోని అన్నివర్గాల వారికి ఫలాలు అందడమే జేఏసీ ధ్యే యమని కోదండరామ్‌ అన్నారు. ఇప్పటివరకు అభివృద్ధి
కార్పొరేట్‌ సంస్థల విస్తరణగానే కనిపించిందని, ఇలాంటి సంస్కృతి వైఎస్‌ పాలనలోనే స్పష్టంగా కనిపించిందన్నారు. ఇకమీదట తెలంగాణ పునర్నిర్మాణంలో తారతమ్యంలేని సమసమాజ స్థాపన ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యమాన్ని అణచివేసిన శక్తులకు రాజ్యాధికారాన్ని అప్పగిస్తే తెలంగాణ వికాసం కనిపించదని ఆయన వ్యాఖ్యానించారు. జేఏసీ ఎప్పటికీ రాజకీయ పార్టీగా ఆవిర్భవించదని, తెలంగాణ పునర్నిర్మాణంలో వాచ్‌డాగ్‌లా పనిచేస్తుందని పునరుద్ఘటించారు. జేఏసీ రాజకీయ పార్టీగా అవతించబోదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సాధన కోసం ఎలాంటి ఉద్యమాన్ని సాగించామో తెలంగాణ పునర్నిర్మాణంలోనూ అలాంటి కీలక భూమికే పోషిస్తామని తెలిపారు.