పాక్ అభిమానికి ధోనీ ‘ఫైనల్ టికెట్’
మీర్పూర్: టి-20 ప్రపంచ కప్ ఫైనల్ సమరానికి ముందు ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్కు చెందిన మహ్మద్ బషీర్ అనే క్రికెట్ వీరాభిమాని ఈ టోర్నీ చూసేందుకు చికాగో నుంచి బంగ్లాదేశ్ వచ్చాడు. పాక్ జట్టు లీగ్ దశలోనే నిష్ర్కమించడంతో బహీర్ భారత్ ఆడే మ్యాచ్లు చూడాలని బంగ్లాలోనే ఆగిపోయాడు. టీమిండియా సెమీస్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం జరిగే తుది సమరంలో భారత్ శ్రీలంకతో తలపడనుంది. అయితే, బహీర్కు ఫైనల్ మ్యాచ్ టికెట్ దొరకలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు.
శనివారం భారత్ ప్రాక్టీస్ సెషన్ను చూసేందుకు బషీర్ వచ్చాడు. ఇంగ్లండ్లో ఇంతకుముందు జరిగిన చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా బషీర్ టీమిండియా కెప్టెన్ను కలిశాడు. ధోనీ ఆ పరిచయాన్ని గుర్తుపెట్టుకుని బషీర్ను పలకరించాడు. టికెట్ దొరకని విషయాన్ని బషీర్ ఏకరువు పెట్టాడు. మహీ వెంటనే ఓ వ్యక్తిని పిలిచి బషీర్కు టి్కెట్ సమకూర్చాల్సిందిగా చెప్పాడు. అతను కాంప్లిమెంటరీ పాస్ ఇవ్వడంతో బషీర్ ఆనందానికి పగ్గాల్లేకుండా పోయాడు. ధోనీకి వీరాభిమానిగా మారిపోయిన బషీర్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.