మన్మోహన్ కోసం సిద్ధమవుతున్న రిటైర్మెంట్ బంగళా

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకున్న తరువాత విశ్రాంత జీవితం గడిపేందుకు మన్మోహన్ సింగ్ కోసం ఢిల్లీ 3, మోతీలాల్ నెహ్రూ రోడ్‌లో విశాల భవంతి సిద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 16న వెల్లడి కానుండగా ఆ లోపునే కొత్త భవంతిలోకి మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే, ఏప్రిల్ 30 కల్లా ఈ భవంతిని సిద్ధం చేసి ఉంచాలని కేంద్ర ప్రజా పనుల శాఖకు ప్రధాని కార్యాలయం నుంచి సూచనలందాయి. ప్రస్తుతం 7, రేస్ కోర్స్ రోడ్‌లో ప్రధానమంత్రి అధికారిక భవనంలో ఉంటున్న మన్మోహన్ సింగ్ దంపతులు మోతీలాల్ నెహ్రూ రోడ్‌లో తాము మారబోయే భవనాన్ని ఇప్పటికే సందర్శించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతకు ముందు ఇక్కడ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ నివసించేవారు. ఆమె ఫిబ్రవరి నెలలో దీనిని ఖాళీ చేశారు.మోతీలాల్ నెహ్రూ రోడ్‌లోని ఈ భవనాన్ని 1920లో 3.5 ఎకరాలలో కట్టారు. దీనికి అనుసంధానంగా బయోడైవర్సిటీ పార్క్ కూడా ఉంది. మాజీ ప్రధానమంత్రి కార్యాలయానికి తగిన వసతులు కూడా ఉన్నాయి. మన్మోహన్ రాక కోసం రూ.35 లక్షల ఖర్చుతో మరమ్మతులు కూడా చేయించారు. భద్రతకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు.