ఖమ్మం నుంచి నారాయణ పోటీ

30 ఏళ్ల తరువాత బరిలో సీపీఐ
హైదరాబాద్‌/ఖమ్మం, ఏప్రిల్‌ 6 (జనంసాక్షి) :
ఖమ్మం పార్లమెంట్‌ స్థానం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డా క్టర్‌ కె. నారాయణ పోటీ చేస్తున్నారు. ఖమ్మం ఎంపీ స్థా నానికి మూడు దశాబ్దాల తర్వాత సీపీఐ పోటీ చేస్తోంది. ఉభ య కమ్యునిస్టు పార్టీలు, ఇతర పార్టీలతో పొత్తులో భాగంగా ఖమ్మం పార్లమెంట్‌ స్థానం ఎక్కువగా సీపీఎంకు లేదా ఇతర పార్టీలకు వెళ్లేది. 30 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సీపీఐ ఇ క్కడ బరిలో నిలిచింది. కాంగ్రెస్‌ పార్టీతో ఎన్నికల అవగాహనలో భాగంగా సీపీఐకి ఖమ్మం పార్లమెంట్‌ స్థానంతో పాటు తొమ్మిది శాసనసభ స్థానాలను కాంగ్రెస్‌ కేటాయించింది. ఖమ్మం జిల్లా కమిటీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో పాటు జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వర్‌రావు పేర్లను అధినాయకత్వానికి సిఫార్సు చేసింది. సీపీఐ కేంద్ర కమిటీ నారాయణ పోటీకి ఆమోదం తెలుపుతూ ఆయన్ను ఖమ్మం అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించే అవకాశమున్నట్లు పార్టీ రాష్ట్ర శాఖ వర్గాలు వెల్లడించాయి. ఖమ్మం నుంచి చివరిసారిగా 1984లో సీపీఐ కేంద్ర నాయకులు నల్లమల గిరిప్రసాద్‌ పోటీ చేశారు. సీపీఎం పర్సా నారాయణ కూడా పోటీ చేయడంతో కాంగ్రెస్‌ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఇక్కడి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత పొత్తు రాజకీయాల్లో సీపీఐకి ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం దక్కలేదు. రాష్ట్ర విజభన నేపథ్యంలో సీపీఎం ఒంటరి పోరుకు సిద్ధపడగా, సీపీఐ మాత్రం కాంగ్రెస్‌తో అవగాహన కుదుర్చుకొని ఎన్నికల బరిలోకి దిగుతుంది.