ఆర్. కృష్ణయ్యపై దాడి
హైదరాబాద్, ఏప్రిల్ 9 (జనంసాక్షి) :బీసీ ఉద్యమ నాయకుడు, టీడీపీ తెలం గాణ ప్రచార కమిటీ చైర్మన్ ఆర్. కృష్ణయ్యపై తెలుగుదేశం పార్టీ అసమ్మతి నాయ కులు దాడి చేశారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆయనపై దాడికి దిగ డంతో ఆయన స్వల్ప గాయాలయ్యాయి. అయినా ఆయన అలాగే వెళ్లి నామినేషన్ వేశారు. సరూర్ నగర్ చౌరస్తాలో ఈ దాడి జరిగింది. ఇటీవలే టీడీపీలో చేరిన కృష్ణ య్య పార్టీ ప్రచార కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఆయనకు పార్టీ ఎల్‌బీ నగర్ టిక్కెట్ల కేటాయిం చింది. బుధవారం నామినేషన్లకు చివరి రోజు కావ డంతో ఆయన నామినేషన్ దాఖలుచేసేందుకు రాగా ఈ దాడి జరిగింది. కృష్ణయ్యపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. గడ్డి అన్నారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణయ్య నామినేషన్ వేయకుండా ప్రత్యర్థి వర్గం అడ్డుకునేందుకు ప్రయత్నించటంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడి జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో టీడీపీ రెబల్ అభ్యర్థి కార్యకర్తలతో పాటు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు అక్కడే ఉండటంతో ఎవరు దాడికి పాల్పడ్డారనే తెలియలేదు. మరోవైపు కృష్ణయ్యకు టికెట్ కేటాయింపుతో ఎల్బీనగర్ టీడీపీ ఇన్‌చార్జి కృష్ణప్రసాద్ పార్టీకి రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. పోలీసులు అక్కడ చేరిన వారిని చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చారు. నగర శివార్లలో ఎక్కువగా సీమాంధ్ర సెటిలర్లు ఉండే ఈ నియోజకవర్గం టికెట్ కోసం టీడీపీ తరఫున ఇన్నాళ్ల నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కృష్ణప్రసాద్‌తో పాటు, ఎన్నాళ్లుగానో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సామా రంగారెడ్డి కూడా గట్టిగా ప్రయత్నించారు. అయితే, బీసీ వర్గం ఓట్లను దండుకోడానికి ఆర్.కృష్ణయ్యను పార్టీలో చేర్చుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనను ఎల్బీనగర్ నుంచి పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇది ఒక్కసారిగా అటు కృష్ణప్రసాద్, ఇటు సామా రంగారెడ్డి ఇద్దరికీ తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇన్నాళ్ల నుంచి పార్టీ జెండాను మోస్తూ, అధికారంలో లేకపోయినా ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ ప్రాంతంలో పార్టీ ఉనికిని ఇన్నాళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న కృష్ణప్రసాద్ ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా మోసినవాళ్లను కాదని, టికెట్లు అమ్ముకుంటున్నారంటూ ఆయన వర్గీయులు మండిపడుతున్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీకి రాజీనామా చేసిన కృష్ణప్రసాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఎన్నాళ్ల నుంచో పార్టీని అంటిపెట్టుకుని, ఈ ప్రాంతంతో చిరకాల అనుబంధం ఉన్న సామా కుటుంబానికి చెందని నాయకుడు సామా రంగారెడ్డి కూడా చంద్రబాబు నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆయన వర్గీయులే ఏకంగా ఆర్.కృష్ణయ్య వాహనంపై దాడికి దిగారని తెలుస్తోంది. ఆయనను నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుపడేందుకు కూడా ప్రయత్నించారు. చివరకు సామా రంగారెడ్డి కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.