తెలంగాణలో ముగిసిన ఉపసంహరణ


1,682 మంది అసెంబ్లీకి, 267 మంది లోక్‌సభ బరిలో..
అవశేష ఆంధ్రప్రదేశ్‌కు మోగిన ఎన్నికల నగారా
సెలవు రోజులు మినహా 19 వరకు నామినేషన్ల స్వీకరణ
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (జనంసాక్షి) :
తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది. 119 అసెంబ్లీ స్థానాలకు 1,682 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, 17 లోక్‌సభ స్థానాల బరిలో 267 మంది అభ్యర్థులు నిలిచినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ఆదివారం ప్రకటిస్తామన్నారు. నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసినా ప్రధాన పార్టీలకు రెబల్స్‌ బెడద తప్పలేదు. సీపీఐకి కేటాయించిన మహేశ్వరం స్థానం నుంచి చివరి నిమిషంలో కాంగ్రెస్‌ బీఫాంతో నామినేషన్‌ వేసిన మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పోటీ నుంచి తప్పుకునేందుకు ససేమిరా అన్నాడు. చివరకు చేతి గుర్తుతోనే ఆయన ఎన్నికల పోటీలో ఉండటం గమనార్హం. సీపీఐ, కాంగ్రెస్‌ పొత్తులో భాగంగా కేటాయించిన మిగతా స్థానాల్లోనూ అసంతృప్త నాయకులు పోటీలో నిలిచారు. ఇక టీడీపీ, బీజేపీ పొత్తుల సంగతి సరేసరి. ప్రధాన రెబల్స్‌ను పోటీ నుంచి తప్పించడంలో ఇరు పార్టీలు విఫలమయ్యాయి. అలాగే సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల ఎన్నికల నగారా మోగింది. 13 జిల్లాల్లో జరగనున్న 25 ఎంపీ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు శనివారం నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. నోటిఫికేషన్‌ విడుదలతో నామినేషన్ల పక్రియ ప్రారంభమైంది. 12నుంచి ఈనెల 19వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. కాగా ఈనెల 13న ఆదివారం, 14న అంబేద్కర్‌ జయంతి, అలాగే 18వ తేదీ గుడ్‌ఫైడ్రేను సెలవు దినాలుగా ప్రకటించారు. దాంతో ఈ మూడు రోజుల్లో నామినేషన్లను స్వీకరించరు. 21న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 23 తుది గడువు. పోలింగ్‌ మే 7వ తేదీన జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 16న జరుపుతారు. తొలిదశ పోలింగ్‌ తెలంగాణలో 30న జరుగనుంది. అలాగే రెండు ప్రాంతాల్లో ఎన్నికలు ముగిశాక 16న కౌంటింగ్‌ జరుపుతారు. నోటిఫికేషన్‌ విడుదలతో సార్వత్రిక సంరంభం ఊపందుకోనుంది. 23 రోజుల పాటు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచార¬రుతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో నిమగ్నం కానున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మునిసిపల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ఒకేసారి వచ్చి రాజకీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. పదిరోజుల తేడాతో అన్ని ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. తొలిపోరైన మునిసిపల్‌ ఎన్నికలను పర్యవేక్షిస్తూనే స్థానిక సంస్థలపై దృష్టిసారించాల్సిన అనివార్య పరిస్థితి రాజకీయపార్టీలకు తలెత్తింది. మునిసిపల్‌ ఎన్నికలు ముగియడంతో స్థానికపోరుపై దృష్టి సారించారు. పార్లమెంటుకు సంబంధించి ఫారం-2ఏ, అసెంబ్లీకి సంబంధించి ఫారం2-బీలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలి. ప్రతి అభ్యర్థి నాలుగుసెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయొచ్చు. ఏ అభ్యర్థి అయినా రెండు పార్లమెంట్‌/అసెంబ్లీ నియోజకవర్గాలకు మంచి నామినేషన్‌లు దాఖలు చేయకూడదు. నామినేషన్‌ పత్రాలకు ఏదైనా డాక్యుమెంట్‌ జతచేయాల్సి వస్తే, 19 మధ్యాహ్నం 3గంటల్లోపు రిటర్నింగ్‌ అధికారులకు అందజేయాలి. రిటర్నింగ్‌ అధికారి కార్యాలయ ఆవరణలోకి అభ్యర్థులకు సంబంధించిన మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థి సహా నలుగురిని మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్‌ ప్రతిపాదకుడు అదే నియోజకవర్గ ఓటరై ఉండాలి. స్వతంత్ర అభ్యర్థులకు పదిమంది ఓటర్లు ప్రతిపాదకులుగా ఉండాలి. నామినేషన్‌ దాఖలు చేసే వ్యక్తి ఆస్తులు, అప్పుల వివరాలను మనదేశంతో పాటు ఇతర దేశాల్లోని వాటిని కూడా పొందుపరచాలి. స్వీకరించిన అన్ని నామినేషన్‌ పత్రాలను, సీఈవో ఆంధ్రా వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అన్ని నామినేషన్‌ పత్రాల అఫిడవిట్‌లు సంబంధిత రిటర్నింగ్‌ అధికారి నోటీసు బోర్డులో ప్రకటిస్తారు. నామినేషన్‌ ఫారం-5ద్వారా అభ్యర్థి సంతకంతో అతని ప్రతిపాదకుడి ద్వారా ఉపసంహరణ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్‌ అయి గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కోరుకునే మూడు గుర్తుల నుంచి ఒకదాన్ని కేటాయిస్తారు.ప్రతి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసి నామినేషన్‌ పత్రాలకు సంబంధించిన వివరాలు తెలుపుతారు. ఇక పోటీ చేయబోతున్న అభ్యర్థి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్రత్యేకంగా బ్యాంక్‌ ఖాతా తెరవాల్సి ఉంటుంది. దీనిద్వారానే ఖర్చులను చూపాలి. ఈసీ నిబంధనల మేరకు వ్యయం చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రచారం 5వ తేదీ సాయంత్రం వరకు ముగుస్తుంది.