ప్రజల మధ్య విద్వేషాలే మోడీ సిద్ధాంతం : ప్రియాంక
రాయ్‌బరేలి, అమేథిలోనే ప్రచారం
అమేథి, ఏప్రిల్ 26 (జనంసాక్షి) :ప్రజల మధ్య విద్వేషాలు రగల్చడమే నరేంద్ర మోడీ సిద్ధాంతమని ప్రియాంక వాద్రా అన్నారు. శనివారం ఉత్తరప్ర దేశ్‌లోని అమేథి లోక్‌సభ నియోజకవర్గంలో తన సోదరుడు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ప్రజలను విభజించి, వారి మధ్య విద్వేషాలు
రగల్చి లబ్ధిపొందాలనుకునే మోడీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అమేథి ప్రజలు బయటి వ్యక్తులను ఓటేయవద్దని సూచించారు. బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరాని, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుమార్ విశ్వాస్‌లు స్థానికులు కాదని ఓట్ల కోసం బయటి నుంచి వచ్చిన వారని పేర్కొన్నారు. అమేథిని పుణ్యభూమిగా అభివర్ణించిన ప్రియాంక తన తండ్రి రాజీవ్‌గాంధీలాగానే తన సోదరుడు రాహుల్ కూడా గొప్ప దార్శనికుడని తెలిపారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి పోటీ చేస్తున్న వారణాసి నుంచి ప్రియాంకతో ప్రచారం చేయించాలని కాంగ్రెస్ శ్రేణులు భావించినా ఆమె ససేమిరా అన్నారు. తన తల్లి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సోదరుడు రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలి, అమేథీ నియోజకవర్గాల్లో ప్రచారానికే తాను పరిమితమవుతానని ప్రియాంకా స్పష్టం చేశారు. పార్టీలో మరిన్ని బాధ్యతలు స్వీకరించడానికి ప్రస్తుతం తాను సిద్ధంగా లేనని తెలిపారు. బీజేపీ చెబుతున్నట్లు దేశంలో ఎక్కడా మోడీ హవా కనిపించడం లేదన్నారు. రాయ్‌బరేలీ నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను చక్కబెట్టేందుకు ప్రియాంకా గాంధీ వాద్రా నడుం కట్టారు.