ఎన్నికల తర్వాత మోడీ గూటికి జగన్
కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్
ఏలూరు, మే 4 (జనంసాక్షి) :
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బీజేపీతో చేతులు కలుపుతాడని కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ అన్నారు. సీమాంధ్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జైరామ్ ఏలూరులో మీడి యాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలను బట్టి జగన్ బీజేపీలో చేరిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. అప్పటి
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల వల్లే సీమాంధ్రలో పార్టీకి నష్టం జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతానికి కలిగే ప్రయోజనాలను వివరించడంలో తమ పార్టీ నేతలు పూర్తిగా విఫలమయ్యారని ఒప్పుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి లేదని తేల్చిచెప్పారు. కింది ప్రాంతానికి జలాలను రానివ్వనని చెప్పడానికి కేసీఆర్ ఎవరని ఆయన ప్రశ్నించారు. నీటి పంపకాల వ్యవహారం కృష్ణా జలాల బోర్డు చూసుకుంటుందన్న కేసీఆర్ వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. దశాబ్దం క్రితం అధికారానికి, ప్రజలకు దూరమైన టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాల్లో ఎదగడానికి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని నిచ్చెన మెట్లలాగా వాడుకుంటున్నాడని జైరామ్ రమేశ్ అన్నారు. కపట బుద్ధితోనే బాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని తెలిపారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పటికీ తెలంగాణలో మాత్రం అధికారంలోకి వస్తుందని అన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రకు తొంబై శాతం గ్రాంటు ఇచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని, అయితే బీజేపీ నేతృత్వంలో ఏర్పడిన రాష్ట్రాలకు ఎలాంటి గ్రాంట్లు ఇవ్వలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 16 వేల కోట్లతో ఐదేళ్లలో పూర్తి చేస్తామని, ఇందులో రూ.14 వేల కోట్లు కేంద్రం ఇచ్చే గ్రాంటేనని వివరించారు.