పంట నష్టంపై అధికారులు కదలండి


గవర్నర్‌ నరసింహన్‌ హుకుం
‘అకాల’ నష్టంపై గవర్నర్‌ సమీక్ష
రెండు రాష్ట్రాల
ఓటాన్‌ ఎకౌంట్‌ ఆమోదం
హైదరాబాద్‌, మే 10 (జనంసాక్షి) :వర్షాల వల్ల వాటిల్లిన పంట నష్టంపై అధి కారులు వెంటనే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని గవర్నర్‌ నరసింహన్‌ ఆదేశించా రు. వర్షాల వల్ల జరిగిన పంటనష్టంపై గవర్నర్‌ నరసింహన్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదే శించారు. జిల్లాల వారీగా పంట నష్టాలపై కలెక్టర్‌ నుండి నివేదిక పంపాలని ఆదేశిం చారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని గవర్నర్‌ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి మహంతిని ఆదేశించారు. రాష్ట్రంలోని మొత్తం పది జిల్లాల్లో వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెద క్‌, నిజామాబాద్‌, నల్గొండ, రంగారెడ్డి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో పంటనష్టం జరిగింది. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌లో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో నలుగురు, శ్రీకాకుళంలో ఇద్దరు, వరంగల్‌లో ఒకరు మృతిచెందారు. కాగా, 42 పశువులు చనిపోగా, ఎనిమిది కూలిపోయాయి. గడిచిన రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 38 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇందులో అత్యధికంగా పశ్చిమ గోదావరి 95 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, ఖమ్మంలో 92 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా కడప జిల్లాలో 5.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణాతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో జరిగిన పంటనష్టానికి సంబంధించి అధికారులు గవర్నర్‌కు ప్రాథమిక నివేదిక అందించారు. ఇందులో మామిడి, వరి, అరటి, పసుపు, ఉల్లి, నిమ్మ, బొప్పాయి, మిర్చి పంటలతో పాటు కూరగాయ పంటలకు కూడా నష్టం జరిగినట్టు విపత్తు నిర్వహణశాఖ అధికారులు వెల్లడించారు. మార్కెట్‌ యార్డులకు తరలించిన ధాన్యం కూడా నీట మునిగిందని, పండ్లతోటలు, ఉద్యానవనాలు బాగా దెబ్బతిన్నాయని అన్నారు. మామిడి పంటకు తీవ్రనష్టం జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. రైతులను ఆదుకోవడానికి తగిన చర్యలు చేపట్టాలని గవర్నర్‌ అధికారులను ఆదేశించారు. ముందుగా పంటనష్టాలపై నివేదికలు తెప్పించుకుని రైతుల్లో ఆత్మస్థైర్యం కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మార్కెటింగ్‌శాఖను రంగంలోకి దింపడంతో పాటు రైతులకు నష్టపరిహారం అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, అందుకు కలెక్టర్ల నుంచి కూడా తగిన సూచనలు, సలహాలు తీసుకోవాలని ఆదేశించారు.
అకాల వర్షాల వల్ల 9988 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. కృష్ణా, కర్నూలు జిల్లాలతో పాటు తెలంగాణలోని ఏడు జిల్లాల్లో నష్టం జరిగినట్లు అంచనా వేసింది. అల్పపీడన ప్రభావంతో గత రెండ్రోజులుగా తెలంగాణతో పాటు సీమాంధ్రలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా వేలాది ఎకరాల్లో చేతికొచ్చిన పంట నీట మునిగింది. కోత కోసి నూర్పిడి చేసిన ధాన్యం కూడా నీటిపాలైంది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న టన్నుల కొద్దీ ధాన్యం తడిసిపోయింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి, సజ్జ పంటలకు తీవ్ర నష్టం జరిగింది. మొత్తం 9988 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. పంటనష్టం వివరాలను సేకరించి పంపించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. కోతకు సిద్ధంగా ఉన్న ధాన్యం, మొక్కజొన్న, సజ్జ, నువ్వు పంటలు నేలమట్టమయ్యాయి. ఆదిలాబాద్‌, నిజామబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లో అధికంగా నష్టం సంభవించింది. పలు జిల్లాల్లో కోసిన ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టంగా పోయారు. కరీంనగర్‌ జిల్లాలో కోతలు ఆలస్యం కావడంతో పంట కోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. కోయాల్సిన వరితో పాటు విక్రయించేందుకు తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. ఒక్క ఈ జిల్లాల్లోనే వరి రైతుకు దాదాపు వెయ్యి కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఇక సజ్జ, నువ్వు, మామిడి రైతులకు మిగిలిన నష్టం దీనికి అదనం. 70 వేల ఎకరాల్లో మామిడి రైతులకు నష్టం కలుగగా, 40 వేల క్వింటాళ్ల పసుపు తడిసిపోయినట్లు సమాచారం. 10 వేల ఎకరాల్లో నువ్వు పంట నేలరాలింది. వరంగల్‌ జిల్లాలోనూ రైతున్నకు భారీ నష్టమే మిగిలింది. 18 వేల హెక్టార్లలో వరి, 5 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 8 వేల హెక్టార్లలో నువ్వు, 6 వేల హెక్టార్లలో సజ్జ పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనికి తోడు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. నిజామాబాద్‌ జిల్లాలో ఊహించని రీతిలో నష్టం సంభవించింది. 25 వేల హెక్టార్లలో వరి, 15 వేల హెక్టార్లలో సజ్జ, 9 వేల హెక్టార్లలో నువ్వు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మార్కెట్‌ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన సుమారు 50 వేల క్వింటాళ్ల వరిధాన్యం తడిసిపోయింది. కామారెడ్డి, బొధన్‌, ఆర్మూర్‌ డివిజన్లలో పంటనష్టం తీవ్రంగా సంభవించింది. అలాగే, ఆదిలాబాద్‌, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉంది. చేతికొచ్చిన ధాన్యం, మామిడి పంట నేలరాలడంతో రైతులు బాగా నష్టపోయారు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురియడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. సుమారు 60 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అకాల వర్షం తూర్పుగోదావరి జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది జిల్లాలోని ఐదు లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. సుమారు 3 లక్షల ఎకరాల్లో కోతలు పూర్తి కాగా, ఇంకా రెండు లక్షల ఎకరాల్లో పంట కోయాల్సి ఉంది. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి మొత్తం నేలకొరిగింది. ఇక కోసిన పంట కల్లాలు, మార్కెట్‌ యార్డులలోనే ఉండిపోయింది. దీనితో పాటు కొనుగోలు కేంద్రాలో నిల్వ ఉంచిన ధాన్యం కూడా నీటి పాలైంది. పంట ఆలస్యంగా వేసిన ప్రాంతాల్లో ఎక్కువ నష్టం ఉందని అధికారులు తెలిపారు. అలాగే పది వేల ఎకరాల్లోని మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు.