టీఎన్‌జీవో అధ్యక్ష, కార్యదర్శులుగా దేవీప్రసాద్‌, రవీందర్‌రెడ్డి


హైదరాబాద్‌, మే 14 (జనంసాక్షి) :
తెలంగాణ ఎన్‌జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా జి. దేవీప్రసాద్‌, ప్రధాన కార్యదర్శిగా కె. రవీందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలాధికారిగా శ్రీనివాస్‌రావు, సమన్వయ అధికారిగా రాధాకృష్ణమూర్తి వ్యవహరించారు. నామినేషన్ల గడువు ముగిసిన అనంతరం దేవిప్రసాద్‌ మాట్లాడుతూ, ఎన్నో దశాబ్దాల పాటు పోరాడి సాధించకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శవంతమైన రాష్ట్రంగా అభివృద్ధి చేసుకోవడానికి అహర్నిషలు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనలో ఉద్యోగులు, టీఎన్‌జీవోల పాత్ర అమోఘమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగుల హక్కులు, పీఆర్సీ అమలు, ఆరోగ్యకార్డుల మంజూరీ, 42 జేఎస్‌జే ప్రత్యేక సెలవు లాంటి సమస్యల పరిష్కారానికి నూతన ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని అన్నారు. ఉద్యోగుల విభజన స్థానికత ఆధారంగానే జరగాలని, తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యోగులే పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో పనిచేస్తున్న సీమాంధ్ర అధికారులను వెంటనే బదిలీ చేయాలని కోరారు. ఏకగ్రీవంగా ఎన్నికవడానికి సహకరించిన అన్ని జిల్లాల బాధ్యులకు, రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అధ్యక్షునిగా దేవిప్రసాద్‌, ప్రధాన కార్యదర్శిగా కారం రవీందర్‌రెడ్డి, అసొసియేట్‌ అధ్యక్షులుగా ఎం, రాజేందర్‌, ఉపాధ్యక్షులుగా ఉపేందర్‌రెడ్డి, కుమారి రేచల్‌, జగదీశ్వర్‌, హస్నోద్దీన్‌, విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు, బుచ్చిరెడ్డి, కార్యదర్శులుగా శంకర్‌, దయానంద్‌, నారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు, సత్తెమ్మ, లక్ష్మీనారాయణ, హరిబాబు, విజేత, శైలజాదేవి, కోశాధికారిగా వేణుగోపాల్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా ఆర్‌. శ్రీనివాస్‌రావు, జీవన్‌రావు, ప్రచార కార్యదర్శిగా ప్రతాప్‌, కార్యవర్గ సభ్యులుగా మనోహర, భవానీసింగ్‌, సుధాకర్‌, మల్లేషం, నర్సింగరావు, అమృత్‌కుమార్‌, యాదయ్య, రాము, కొండల్‌రెడ్డి ఎన్నికయ్యారు. వీరి ఎన్నికను ఎన్నికల అధికారి గురువారం అధికారికంగా ప్రకటిస్తారు. 20న నిర్వహించే స్టాండింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో బాధ్యతలు స్వీకరిస్తారు.