రాష్ట్రపతికి చేరిన లోక్ సభ అభ్యర్థుల జాబితా
న్యూఢిల్లీ: త్వరలో కొత్తగా కొలువు తీరనున్న 16వ లోక్ సభకు సంబంధించిన అభ్యర్థుల జాబితా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి చేరింది. తాజాగా ఎన్నికైన ఎంపీల జాబితా వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సంపత్ ఆదివారం రాష్ట్రపతికి అందజేశారు. ఈ జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. లోక్ సభ చరిత్రలోనే అత్యధికం మహిళలు ఎంపిక కావడం ఇదే తొలిసారి. మొత్తం ఉన్న 543 ఎంపీల్లో 61 మంది మహిళలు ఉన్నారు. ఇదిలా ఉండగా 55 ఏళ్లకు పైబడిన వారిలో 47 శాతం మంది ఎంపీలు ఉన్నారు. ఈసారి లోక్ సభకు ఎన్నికైన అభ్యర్థుల్లో 75 శాతం మంది ఎంపీలు మాత్రమే పట్టభద్రుల హోదా దక్కించుకున్నారు.
ఇది 15వ లోక్ సభ తో పోల్చుకుంటే దాదాపు నాలుగు శాతం తక్కువగానే కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా ఎన్నికైన వారిలో 10 శాతం మంది మెట్రిక్యూలేషన్ దాటిన వారుకూడా ఉండగా, అసలు ఆ పరిధి దాటని వాళ్లు 13 శాతం మంది ఎంపీలు ఉన్నారు. ఇలా మెట్రిక్యూలేషన్ కూడా పొందని వారు మాత్రం గతం కంటే 10 శాతం ఎక్కువ.కాగా, డాక్టరేట్ పట్టా ఉన్న ఎంపీల సంఖ్యమాత్రం 2009 కంటే ఎక్కువగా నమోదైంది. ఆ హోదా కల్గిన వారు 3 శాతం నుంచి 6 శాతానికి పెరిగారు. మరి కొద్దిరోజుల్లో కొత్త లోక్ సభ ఏర్పాటు అవుతున్న తరుణంలో 15 వ లోక్ సభను రాష్ట్రపతి రద్దు చేశారు.