తెలంగాణ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు వద్దే వద్దు


రంగంలోకి దిగిన కేసీఆర్‌
అభ్యంతరాలపై కమిటీ
తప్పుడు ధ్రువీకరణాలపై
విచారణ
– హరీశ్‌, స్వామిగౌడ్‌,
మహేందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ మరో ఇద్దరు అధికారులతో కమిటీ
– ఉద్యోగ సంఘాలతో నేడు టీఆర్‌ఎస్‌ చీఫ్‌ భేటీ
హైదరాబాద్‌, మే21 (జనంసాక్షి):
తెలంగాణ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు వద్దే వద్దని టీఆర్‌ఎస్‌ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు స్పష్టం చేశా రు. ఈ మేరకు గురువారం ఆయన కొంపల్లిలోని ఆర్డీ కన్వెన్షన్‌ హాలులో ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. ఉద్యోగ సంఘాల ఆందోళన, బది లీల్లో స్థానికతకు చోటు లేకుండా చేశారనే నేపథ్యంలో కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 806 ఉద్యోగుల్లో 193 మంది తెలంగాణవారు కాదంటూ ఉద్యోగులు అభ్యంతరం తెలిపారు. ఈ 193 మంది ఉద్యోగుల వివరాలను సర్వీసెస్‌ ముఖ్య కార్యదర్శికి సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, శ్రవణ్‌ అందిం చారు. సచివాలయంలోని 1,865 మంది ఉద్యోగుల స్థానికతను నిర్ధారిస్తూ ప్రభుత్వం మంగళవారం జాబితా వెల్లడించిన విషయం
తెలిసిందే. వీరిలో 1,059 మంది ఆంధ్ర, 806 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులుగా పేర్కొన్నారు. ఆర్థిక శాఖ ఇటీవల ఆన్‌లైన్‌లో సేకరించిన వివరాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉద్యోగులు తమ, ఇతర ఉద్యోగుల స్థానికత వివరాలపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలియజేయాలని జాబితా వెల్లడించిన సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) సూచించింది. దీంతో ఈ విషయాన్ని కాబోయే ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు వివరించాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందే కళ్లముందు అన్యాయం జరుగుతోందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. దీంతో గురువారం జరిగే సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇదిలా ఉండగా సినీ నటి జమున కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మెజార్టీ స్థానాల్ని కైవసం చేసుకొని ప్రభుత్వాని ఏర్పాటు చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. నల్గొండ జిల్లా కలెక్టర్‌ చిరంజీవులు సైతం కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
అభ్యంతరాలపై కమిటీ..
రాష్ట్ర విభజనలో భాగంగా ఉద్యోగుల విభజనపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల పంపిణీలో పారదర్శకత లోపించిందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. సీమాంధ్రకు చెందన ఉద్యోగులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఇక్కడ తిష్ఠ వేసేందుకు యత్నిస్తున్నారని తెలంగాణ సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ఉద్యోగుల ఆందోళనపై దృష్టి సారించారు. తప్పుడు ధ్రువీకరణాలపై ఆరా తీసిన ఆయన వాటి సంగతి తేల్చేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో హరీశ్‌రావు, స్వామిగౌడ్‌, మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌తో సహా మరో ఇద్దరు మాజీ ఐఏఎస్‌ అధికారులున్నారు. తప్పుడు పత్రాలు సమర్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన నిర్ణయించారు. ఈ కమిటీ టీఆర్‌ఎస్‌ కార్యాలయం తెలంగాణ భవన్‌లో అందుబాటులో ఉంటుందని, విభజనపై ఎలాంటి అభ్యంతరాలున్నా, తప్పుడు ధ్రువీకరణాలతో స్థానికుడిగా ఎవరైనా పేర్కొంటే తమ దృష్టికి తీసుకొస్తే పత్రాలను కమిటీ పరిశీలిస్తుందని శ్రీనివాస్‌ గౌడ్‌ పేర్కొన్నారు.