కొనసాగుతున్న విద్యుత్‌ ఉద్యోగుల సమ్మె


కొత్త సర్కారే పరిష్కరించాలి : మహంతి
ససేమిరా విరమించం : ఉద్యోగ సంఘాలు
హైదరాబాద్‌, మే 25 (జనంసాక్షి) :
విద్యుత్‌ ఉద్యోగులు చేపట్టిన మెరుపు సమ్మె కొనసాగుతోంది. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఆదివారం ఉదయం నుంచి విద్యుత్‌ సి బ్బంది విధులకు హాజరుకాలేదు. హైదరాబాద్‌లో విద్యుత్‌ సౌధ వద్ద ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అలా గే విజయవాడలో వీటీపీఎస్‌ ఉద్యోగులు ఆఫీసు
కార్యాలయ గేట్‌ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. అలాగే వరంగల్‌ జిల్లా కేటీపీపీ ఎదుట జెన్కో ఉద్యోగులు మెరుపు సమ్మెను చేపట్టారు. ప్రధాన గేట్‌కు తాళం వేసి బైఠాయించి యాజమాన్యం వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మరోవైపు కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం ఆర్‌టీపీపీ మొదటి యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో 210 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు భవిష్యత్‌ కార్యాచరణపై హైదరాబాద్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో 30 ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. పీఆర్సీ 27.5 శాతం అమలు చేయాని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు పనికి తగ్గ వేతనం చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నప్పటికీ తాము బయపడేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టంచేశారు. ఈ సమ్మెలో ఏపీజెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంల ఉద్యోగులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఉద్యోగుల సమ్మెపై రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ సమీక్షించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సీఎస్‌ మహంతికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో మహంతి విద్యుత్‌ సంస్థలకు చెందిన అధికారులతో భేటీ అయి ఉద్యోగ సమస్యలపై సమీక్షించారు. విద్యుత్‌ ఉద్యోగులు చేపట్టిన మెరుపు సమ్మెను వెంటనే విరమించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మెకు దిగడం సరికాదన్నారు. ఆదివారం విద్యుత్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మెపై మహంతి ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు విద్యుత్‌ సంస్థల పరిస్థితులను మహంతికి వివరించారు. సమావేశానంతరం మహంతి మీడియాతో మాట్లాడుతూ, మే 21న విద్యుత్‌ ఉద్యోగులకు సంబంధించిన పిఆర్‌సి నివేదిక ప్రభుత్వానికి అందిందని చెప్పారు. ఉద్యోగులు కోరుకున్న ప్రకారం పిఆర్‌సి చెల్లిస్తే ప్రభుత్వంపై 1250 కోట్ల భారం పడుతుందన్నారు. దీనికి సంబంధించిన నివేదికను గవర్నర్‌కు పంపించడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా వీరి సమస్యలపై విద్యుత్‌ సంస్థల అధికారులతో చర్చించామని అన్నారు. అలాగే పిఆర్‌సిని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు. ఉద్యోగులు సమ్మె విరమిస్తారన్న నమ్మకం ఉందని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమించాలని కోరారు. కాగా, ఉద్యోగుల సమ్మెపై గవర్నర్‌ నరసింహన్‌ సమీక్షించారు. మెరుపు సమ్మె దృష్ట్యా ఆయా డిజిపితో పరిస్థితులు సమీక్షించారు. విద్యుత్‌ సౌద, ఉపకేంద్రాలు, రైల్వేట్రాక్‌ వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని గవర్నర్‌ డిజిపిని ఆదేశించారు. విద్యుత్‌ సరఫరా యధావిధిగా కొనసాగాలని, సరఫరాలో అంతరాయం కలిగితే క్షమించేది లేదని గవర్నర్‌ ఉద్యోగులను హెచ్చరించారు. గవర్నర్‌తో సమావేశానంతరం డిజిపి పోలీస్‌ ఉన్నతాధికారలతో సమ్మెపై సమీక్షించారు. మెరుపు సమ్మె చట్టవిరుద్ధమని, అది చట్టాన్ని అతిక్రమించడమే అవుతుందని పేర్కొన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సమ్మె కారణంగా ప్రజలకు, సంస్థలకు, విద్యుత్‌ రంగానికి ముఖ్యంగా ఆసుపత్రులకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే తమ ఆందోళనను ససేమిరా విరమించబోమని విద్యుత్‌ ఉద్యోగులు తేల్చిచెప్పారు. ఆర్టీసీ, ఇతర సంస్థల పీఆర్సీ ఫైళ్లను ఓకే చేసిన గవర్నర్‌ తమ ఫైల్‌ మాత్రమే ఆపడం సరికాదంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని, ప్రజలకు అసౌకర్యం కలిగితే తమది బాధ్యత కాదని వారు పేర్కొన్నారు.