కొలిమంటుకుంటున్న పోలవరం

polavaram
ఖమ్మం, మే 29 (జనంసాక్షి) :

పోలవరం ఆర్డినెన్స్‌ విషయంలో కేంద్రం అనుసరించిన తీరుతో ఖమ్మం జిల్లా ప్రజలు ఉద్యమాలకు సన్నద్ధమవుతున్నారు. గిరిజనులకు అండగా నిలుస్తూ పోరాటాలకు సిద్ధమవుతున్నారు. పోలవరం ఆర్డినెన్స్‌ తీసుకుని రావడానికి ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులు సమాచారాన్ని సేకరించారని తెలుస్తోంది. ఈ మేరకే కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. పోలవరం ఎంతోకాలంగా నానుతున్న వ్యవహారం కావడంతో సమాచారాన్ని సేకరించిన జిల్లా అధికార యంత్రాంగం కేంద్రానికి నివేదించింది. ఇటీవలే  కలెక్టర్‌, ముంపు మండలాల తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో సమావేశం నిర్వహించి, ముంపు ప్రాంత సమగ్ర స్వరూపాన్ని సేకరించడం ఈ ఆర్డినెన్స్‌ కోసమేనని తెలుస్తోంది. అయితే దీనిపై ఇక్కడి రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధం అవుతున్నాయి. గురువారం  బందులో అన్ని పార్టీలు సంస్థలు పాల్గొన్నాయి.ఈ నెల 31న తెలంగాణ ఉద్యోగుల ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ కోదండరామ్‌ ముంపు ప్రాంతంలో పాదయాత్ర జరపబోతున్నారు. జూన్‌ 1న వేలేరుపాడులో భారీ బహిరంగసభను ఏర్పాటుచేశారు. తెలంగాణలో ఉద్యమం ఉద్ధృతం అవుతున్న సమయంలోనే సీమాంధ్రలోనూ ముంపు ప్రాంతాన్ని కోరుతూ ఉద్యమం రూపుదాల్చుతోంది. ముంపు ప్రాంతాన్ని సీమాంధ్రకే ధారాదత్తం చేస్తూ, కేందప్రభుత్వం ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. ఇప్పటికే విభజన బిల్లు ద్వారా సీమాంధ్రలో విలీనం చేసిన గ్రామాలతో పాటు అదనంగా మరికొన్ని గ్రామాలను ఈ ఆర్డినెన్స్‌లో పొందుపరిచినట్లు సమాచారం. చింతూరు, బూర్గంపాడు మండలాల్లో మార్పులు, చేర్పులు ఉండవచ్చునని తెలుస్తోంది. ఆర్డినెన్స్‌ సమగ్ర రూపం తేలేందుకు మరికొంత సమయం పట్టవచ్చు. ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపినట్లు వార్తలు వెలువడగానే ముంపు ప్రాంతంలో ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. పార్టీలు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు నిరసన ప్రదర్శనలకు దిగాయి. పోరాటాలు ఉద్ధృతం అవుతున్న నేపథ్యంలో కేంద ప్రభుత్వ నిర్ణయం మరింత ఆజ్యం పోసింది. ఆంధప్రదేశ్‌ విభజన బిల్లులో 211 గ్రామాలుండగా, తాజాగా జిల్లా అధికారులు పంపిన నివేదికలో 266 గ్రామాలున్నాయి. ఇవిగాక మరికొన్ని గ్రామాలు కూడా విలీనంలో చోటు కల్పించినట్లు పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. ముంపు గ్రామాలు స్థానే ముంపు మండలాలు అన్నట్లుగా సమాచారం వస్తుండడంతో, విలీన ప్రాంతం అధిక విస్తీర్ణంలో ఉండవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆర్డినెన్స్‌ కారణంగా తెలంగాణవాసుల ఆశలు అడియాసలయ్యాయి. రాష్ట్ర విభజనలో కీలకం, అదే సమయంలో వివాదాస్పదం కూడా ముంపు ప్రాంతమే కావడం యాదృచ్ఛికం. ఇటు తెలంగాణ అటు ఆంధ్రా ఇరు ప్రాంతాలు, ముంపు ప్రాంతాన్నే కోరుకుంటున్నాయి. అపార వనరులు కల ఈ ప్రాంతాన్ని వదులుకోవడానికి తెలంగాణ ఏమాత్రం అంగీకరించడం లేదు. ఇదే సమయంలో పోలవరం అనుమతులు, ఇతర వనరులు గల ఈ ప్రాంతాన్ని తమకే కేటాయించాలంటూ సీమాంధ్ర పట్టుపడుతోంది. ఇవే డిమాండ్‌లతో ఇరు ప్రాంతాల్లోనూ ఉద్యమాలు కొనసాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 276 గ్రామాలు ముంపునకు గురవుతాయి. దీంతో ఆయా గ్రామాల్లో ఆందళన నెలకొంది. తమ గ్రామాలను వదులకోమని వారు భీష్మించుకున్నారు. తమకు తెలియకుండా ముంచడాన్ని వారు అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. తమ సంస్కృతిని దెబ్బతీస్తూ ఆంధ్రాలో కలిపితే ఊరుకోబోమని పలు గ్రామాల ప్రజలు హెచ్చరించారు.  వీటిలో తూర్పులో 39, పశ్చిమలో 29, ఖమ్మంలో 195 ఆవాసాలు.. మిగిలినవి ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్నాయి. అంతర్‌ రాష్ట్రాల్లో ఈ సమస్యకు సామరస్య పూరక పరిష్కారం లభించినా ఇక్కడ మాత్రం ప్రధానంగా తెలంగాణ పరిధిలోని ఖమ్మంలో మాత్రం దీనికి పరిష్కారం లభించలేదు. ముంపు సమస్య నేపథ్యంలో పునరావాసం పూర్తయితేనేగాని ప్రాజెక్టు పూర్తయినా ప్రారంభించడానికి అవకాశం లేదు. దీంతో వీటిని ఆంధ్ర రాష్ట్రంలో కలపాలని ప్రతిపాదనలు వెళ్లాయి. పోలవరం ప్రాజెక్టుకు ప్రధాన అవరోధమైన ముంపు గ్రామాల సమస్యకు ఆర్డినెన్స్‌తో పరిష్కారం చూపాలనుకున్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాలు ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా ఉండగా విభజన నేపథ్యంలో వీటన్నింటినీ ఆంధప్రదేశ్‌లో కలపాలని తీర్మానించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రపతికి ఆర్డినెన్స్‌ను పంపించారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాల పరిధిలో మొత్తం 195 ఆవాసాలు ఆంధ్రలో కలపడానికి సాంకేతికంగా అవరోధం తొలగిపోయినా ప్రజలు ఎలా ఒప్పిస్తారన్నది ప్రశ్నగా ఉంది. దీంతో ప్రాజెక్టు పరిధిలోని ప్రధానమైన పునరావాస పక్రియ వేగం కానుందని అంటున్నారు. ఇటీవల విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ ¬దా కల్పించడం ద్వారా నిధులు, నిర్మాణ బాధ్యత మొత్తం కేంద్రం తీసుకునే విధంగా చర్యలు చేపట్టడానికి నిర్ణయం తీసుకుంది. అయితే పునరావాసం ప్రధాన సమస్యకాగా ఖమ్మం జిల్లాలో అధికంగా ముంపు గ్రామాలు ఎక్కువగా ఉండగా వీటిని కొత్త ఆంధప్రదేశ్‌లో కలపాలని ప్రతిపాదనలు వెళ్లాయి. కేంద్రం ఆమోదముద్ర వేయడంతో ఇక నుంచి ఖమ్మం జిల్లాలోని ముంపు గ్రామాలున్న ఏడు మండలాలు.. ఇందులో 195 ఆవాసాలు ఆంధ్రలో కలవనున్నాయి.  పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టు నిర్మాణం ద్వారా 7.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 80 టీఎంసీల నీటిని కృష్ణాకు మళ్లించడం, విశాఖపట్నానికి తాగునీరు, పరిశ్రమలకు నీటిని సరఫరా చేయడం వంటి ప్రయోజనాలు చేకూరతాయి. 960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తవుతుందని నీటిపారుదల శాఖాధికారులు చెబుతున్నారు. బహుళార్థ సాధక ప్రాజెక్టుగా పేరొందినా ఆది నుంచీ అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. 2004లో పునాదిరాయి పడగా అప్పట్లో ఈ పనులను గుత్తేదారు సంస్థ కొంతవరకూ పూర్తి చేసింది. ఇటీవల ఈ పనుల్లో పురోగతి రాగా కొత్త గుత్తేదారు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ ఈ పనులను చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ తోటగొంది వద్ద ఓటీ రెగ్యులేటర్‌, చేగొండిపల్లి వద్ద హెడ్‌ రెగ్యులేటర్‌, మామిడిగొంది వద్ద ఎఫ్‌ ఛానల్‌ నిర్మాణం పూర్తికావస్తోంది.జంట సొరంగాల తవ్వకాలు కూడా పూర్తి కాగా దీనికి లైనింగ్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అనుబంధ పనులు వేగంగా పూర్తవుతున్నా ప్రాజెక్టుకు ప్రాణాధారమైన స్పిల్‌వే, ఎర్త్‌కం ర్యాక్‌ఫిల్‌ డ్యాం నిర్మాణం పనులు మాత్రం అంత వేగంగా జరగడంలేదు. దీనికి ప్రధాన కారణం నిధులు కొరతే. వీటిలో మొత్తం 66,500 మంది జనాభా సీమాంధ్రలో కలవనున్నారు. కుక్కునూరు, బూర్గంపాడు మండలాల్లోని గ్రామాలు పశ్చిమ ఏజెన్సీలోనూ, మిగిలిన 5 మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. నదికి ఇరువైపులా ఉన్న గ్రామాలకు అనుగుణంగా ఉభయ గోదావరి జిల్లాల్లోనూ కలిపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇటు పశ్చిమగోదావరిలోనూ, అటు తూర్పుగోదావరిలోనూ పునరావాస పక్రియ కొంతవరకూ మెరుగ్గానే సాగుతుండగా ఖమ్మంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రస్తుతం ఆర్డినెన్స్‌ రావడంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించగలదని భావిస్తున్నారు. అయితే ప్రజలను తరలించడం అంత ఈజీ కాదని అంటున్నారు.