ఆదివాసీల రక్షణకు ఉద్యమించాలి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సంబరాలు జోరుగా సాగుతున్నాయి. మధ్యలో రైతు రుణమాఫీపై ఆంక్షల పేరుతో సంబరాలు కాస్త ఆందోళన రూపుదాల్చినా అవి సీమాంధ్ర పార్టీలు, మీడియా సృష్టిస్తున్నవేననే వాదనలూ ఉన్నాయి. జూన్ రెండున మొదలైన సంబరాలు ఎనిమిదో తేదీతో ముగియనున్నాయి. ఇప్పటికే తెలంగాణాలో ప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణ రాష్ట్రం ఉనికిలోకి వచ్చిన రోజునే కేసీఆర్ కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందే కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. నరేంద్రమోడీ ప్రధాని గద్దెనెక్కిన తర్వాత తీసుకున్న మొట్టమొదటి నిర్ణయమే దేశ మూలవాసులైన ఆదివాసుల్ని ముంచేసే పోలవరం ఆర్డినెన్స్‌కు రాజముద్ర. తొలి కేబినెట్ భేటీలో తెలంగాణకు చెందిన మంత్రి ప్రాతినిథ్యం లేకుండా చేసి ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం కేంద్రానికి ఏమిటన్నది ఇప్పుడు తెలంగాణవాదుల ప్రశ్న. తెలంగాణలోని సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందిన పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు తొలి విడతలోనే మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడానికి పోలవరం ఆర్డినెన్స్ ఒక్కటే కారణం. దత్తాత్రేయ కేబినెట్‌లో ఉంటే ఆర్డినెన్స్‌పై కేంద్రం వైఖరిని నిలదీస్తాడనో? తెలంగాణవాదులకు విషయం చేరవేస్తాడనో? చెప్పి బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అతడికి మంత్రివర్గంలో చోటు కల్పించకుండా చేశారు. తమ పాచిక పారేందుకు తెలంగాణ వాళ్లెవరూ కేబినెట్‌లో ఉండకూడదని మోడీని ఒప్పించారు. మోడీ కూడా క్షేత్రస్థాయి సమాచారాన్ని తెప్పించుకోకుండానే అడ్డగోలుగా ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. దాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్ పిలుపునిచ్చిన బంద్ గ్రాండ్ సక్సెస్ అయింది. బంద్‌పై గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఇచ్చిన నివేదిక చూసిన తర్వాతగానీ మోడీకి ఆర్డినెన్స్ తీవ్రత తెలిసిరాలేదు. వారం రోజుల్లో పార్లమెంట్ సమావేశమవుతుండగా సంపూర్ణ మెజార్టీ ఉన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా కాకుండా ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడమంటేనే అది ఎంత లోపభూయిష్టమైనదో అర్థం చేసుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టు ద్వారా అత్యధిక భూమి ముంపునకు గురికావడంతో పాటు ఖమ్మం జిల్లాతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని ఆదివాసీ మండలాలు జలసమాధి కానున్నాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నా వినకుండా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుంటోంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రభుత్వాలు మొత్తానికే పోలవరం నిర్మాణం చేపట్టవద్దని డిమాండ్ చేస్తుండగా, తెలంగాణ మాత్రం ప్రస్తుత డిజైన్‌లో పోలవరం ప్రాజెక్టును కట్టవద్దని కోరుతోంది. పోలవరం నిర్మాణ ప్రాంతం భూకంప ప్రభావిత ప్రాంతం కాబట్టి అక్కడ ప్రాజెక్టు కడితే కోస్తాంధ్ర జిల్లాలే భారీ నష్టాన్ని చవిచూస్తాయని తెలంగాణ ప్రజలు హెచ్చరిస్తున్నారు. అయినా సరే అక్కడే కట్టాలని సీమాంధ్ర పెత్తందారులు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంపై భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ఐదు రోజుల పాటు దీక్ష చేసిన ఆయన ప్రాణాపాయ స్థితికి చేరుకున్నా కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాలతో పాటు న్యాయపోరాటం ద్వారా ముంపు గ్రామాల విలీనం ఆర్డినెన్స్‌ను రద్దు చేయిస్తామని హామీ ఇచ్చి రాజయ్యతో దీక్ష విరమింపజేసింది. రెండు లక్షల ఎకరాలకు పైగా విలువైన అటవీ భూమి, రెండు లక్షల మంది వరకు ప్రజలు వారిలో లక్ష మందికి పైగా ఆదివాసీలు నిర్వాసితులవున్నా పట్టించుకోకుండా కేంద్రం ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది.
భారీ ప్రాజెక్టులు, ఇతరత్రా అభివృద్ధి పనుల కోసం 50 వేల మందికంటే ఎక్కువ మంది ఆదివాసీలు నిర్వాసితులయ్యే పక్షంలో వారి అభిప్రాయం మేరకే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదివాసీ రక్షణ చట్టాలు చెప్తున్నాయి. రాజ్యాంగం నిర్దేశించిన ఆదివాసీ రక్షణ చట్టాలను కేంద్రం తుంగలో తొక్కుతూ వారిని ముంచేసే ఆర్డినెన్స్‌కు రాజముద్ర వేయించింది. లక్షమందికి పైగా ఆదివాసీలు, వారిలో అత్యంత అరుధైన కొండరెడ్లు పూర్తిగా అంతరించే అవకాశమున్నా లక్ష్య పెట్టకుండా కేంద్రం సీమాంధ్ర పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, బడా బాబుల వ్యాపార ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. అడవిలో తప్ప బాహ్య ప్రపంచంలో జీవించలేని వారిని రోడ్డున పడేసి వారి జాతులను పూర్తిగా అంతమొందించడానికి మోడీ సర్కారు కంకణం కట్టుకుంది. అడవిలో తప్ప జీవించలేని వారిని పునరావాసం పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోకి బదలాయించడం ద్వారా వారి జీవించే హక్కును హరిస్తోంది. తెలంగాణ ఇస్తున్నామనే పేరుతో సీమాంధ్రులను సంతృప్తి పరచడానికి కేంద్రం పోలవరానికి జాతీయ హోదా కట్టబెట్టింది. 90 శాతం కేంద్ర నిధులతోనే ప్రాజెక్టు నిర్మాణానికి ఉపక్రమిస్తోంది. పునరావాసంలో భాగంగా భూమి కోల్పోయిన వారికి ప్రతిగా భూమి, ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు నిర్మించి ఇస్తారేమో మరి అడవిని కోల్పోతున్న ఆదివాసీలకు ఎక్కడి నుంచి అడవి తెచ్చి ఇస్తారో కేంద్రం చెప్పాలి. నోరులేని ఆదివాసీల పక్షాన ఇప్పటికే కొన్ని సంఘాలు ఉద్యమిస్తున్నాయి. అయితే అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ న్యాయ, ప్రజాపోరాటాలు నిర్వహిస్తామని చెప్తోన్న బంద్ తర్వాత నిర్దిష్టమైన విధానాలు ఏవీ ప్రకటించలేదు. అలాగే తెలంగాణలోని రాజకీయ పార్టీలు కూడా పోలవరం ముంపు గ్రామాల బదలాయింపుపై తమ విధానాలు స్పష్టం చేయాలి. ఖమ్మం జిల్లాకే పరిమితమైన వైఎస్సార్ సీపీ నేతలు ముంపు గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తుండగా, సీమాంధ్ర నేతలు మాత్రం బదలాయింపును సమర్థిస్తున్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తుమ్మల నాగేశ్వర్‌రావు ఒక్కరే బదలాయింపును వ్యతిరేకించగా, మిగతా వాళ్లంతా చంద్రబాబు అడుగులకు మడుగులొత్తారు. పైపెచ్చు బంద్‌కు పిలుపునిచ్చిన అధికారపార్టీపై ఆరోపణలు ఎక్కుపెట్టారు. ఆరోపణలు.. ప్రత్యారోపణలతో ప్రయోజనం లేదు. ఆదివాసీల రక్షణకు అన్ని రాజకీయ పక్షాలు ఒక్కతాటిపైకి రావాలి. ఇందుకు మామూలు ఉద్యమం కాదు మహత్తర ఉద్యమాన్ని నడపాలి. ఆదివాసీల పక్షాన ఉద్యమించాలి. తెలంగాణ పౌర సమాజం ఈ కర్తవ్యాన్ని తు.చ. తప్పకుండా నిర్వహించాలి.