భానుడి ఉగ్రరూపం
హైదరాబాద్, జూన్ 13 (జనంసాక్షి) :
భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రోహిణీ కార్తె ముగిసి మృగశిర కార్తె ప్రవేశించినా తన ప్రతాపాన్ని తగ్గించలేదు. ఎండ తీవ్రతకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. రుతుపవనాల ఆలస్యంతో ఎండలు మండుతున్నాయి. ఎండ వేడికి తాళలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం కూడా ఎండలు మండుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గురువారం వడగాలులకు తాళలేక 15 మంది మృత్యువాతపడగా, శుక్రవారం వడగాలుల తాకిడికి విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలంలో సూరమ్మ, అప్పయమ్మ, కోదండ అనే ముగ్గురు వృద్ధులు మృతిచెందారు. మండలంలో గడచిన నాలుగు రోజుల్లో వడగాలుల తీవ్రతతో మృతి చెందిన వారి సంఖ్య 12కు చేరింది. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 56కు చేరింది. ఆంధప్రదేశ్లోని పలు జిల్లాల్లో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు విలవిలల్లాడుతున్నారు. ఉక్కపోత ఒకవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. ఉడికించేలా వేడిగాలులు ఊపిరాడకుండా చేస్తున్నాయి. మూడు రోజులుగా అనూహ్యంగా వాతావరణంలో మార్పులతో బెంబేలెత్తిపోతున్నారు. రోడ్ల విూదకు రావాలంటే భయపడుతున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. విపరీతమైన వడగాలులు, ఉక్కపోతతో తూర్పు గోదావరి జిల్లాలో 13మంది, విశాఖలో 8మంది మృతి చెందారు. వడగాల్పులు, పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో విశాఖ జిల్లాలో పాఠశాలను ఒక్కపూటే నడపాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో శుక్రవారం, శనివారం పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ల ఆదేశాలతో సెలవు ప్రకటించారు.
చిరుజల్లులతో సేదతీరిన ఢిల్లీ
గురువారం సాయంత్రం, శుక్రవారం ఉదయం కురిసిన చిరుజల్లులతో రాజధాని ఢిల్లీ నగరం సేదతీరింది. సాయంత్రం ఈదురుగాలులతో కూడిన జల్లులు పడగా ఈరోజు ఉదయం ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి. జూన్ 6 నుంచి 10 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలతో తల్లడిల్లిన ఢిల్లీ ప్రజలు ఇప్పుడు కాస్త ధైర్యంగా రోడ్డుమీదికి రాగలుగుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీలకు అటూఇటూగా ఉంది. వచ్చే బుధవారం వరకూ వాతావరణం ఇలాగే ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.