మన బిడ్డల ఫీజులు మనమే కడతాం

one
ఆంధ్ర, తెలంగాణాలో చదివినా తల్లిదండ్రుల స్థానికత ఆధారం
ఆంధ్ర విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తెలంగాణ సర్కార్‌కు సంబంధం లేదు
అఖిలపక్షంలో నిర్ణయం శ్రీవిద్యా శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్‌, జూన్‌ 16
(జనంసాక్షి) :
తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఏ ప్రాంతంలో చదువుకున్నా వారి ఫీజులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని యథాతథంగా అమలు చేస్తామని తెలిపారు. రీయింబర్స్‌మెంట్‌ పథకంపై అనేక సందేహాలు నెలకొన్న నేపథ్యంలో వాటికి తెరదించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దీనిపై అన్ని పార్టీలతో చర్చించాకే అందరి భాగస్వామ్యంతో నిర్ణయం తీసుకుంటామని ఇది వరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాంత విద్యార్థులందరి ఫీజులు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర ప్రాంతంలోని విద్యాసంస్థల్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల ఫీజులు సైతం చెల్లించాలని నిర్ణయించారు. విద్యార్థులు ఆంధ్రాలో చదువుతున్నా వారి తల్లిదండ్రుల స్థానికత ఆధారంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. అలాగే తెలంగాణలో చదువుతున్న సీమాంధ్ర ప్రాంత విద్యార్థుల బోధన ఫీజులను ఆంధ్రప్రదేశ్‌ సర్కారు చెల్లించాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య, మంత్రులు ఈటెల రాజేందర్‌, జగదీశ్వర్‌రెడ్డి, హరీశ్‌రావుతో పాటు వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే గతేడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. సమావేశం అనంతరం బీసీ సంఘాల నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల ఫీజులు ఆ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని ఇది కేంద్ర నిర్ణయమని అన్నారు. గతంలో ఉన్న సంప్రదాయాలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే ఫీజుల చెల్లింపు ఉండాలని ఆయన అన్నారు. మెడికల్‌ సీట్లలో మూడు గ్రూపులను రెండు గ్రూపులుగా చేయాలని, కన్వీనర్‌ కోటాలో 80 శాతం, యాజమాన్య కోటాలో 20 శాతం ఉండాలే నిర్ణయం తీసుకోవాలని కోరామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు తలొగ్గాలని ఆయన స్పష్టం చేశారు.