మండలి బరిలో స్వామిగౌడ్‌, హుస్సేన్‌

4A4B
అనివార్యమైన ఎన్నిక

స్వామిగౌడ్‌ ఎన్నిక లాంఛనమే..

గెలుపుపై ధీమాగా కాంగ్రెస్‌

హైదరాబాద్‌, జులై 1 (జనంసాక్షి) :

శాసనమండలి చైర్మన్‌ పదవికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి సదారాంకు మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి స్వామిగౌడ్‌ వెంట మంత్రులు ఈటెల రాజేందర్‌, నాయిని నర్సింహారెడ్డి, హరీష్‌రావు, కేటీఆర్‌, పద్మారావు, జగదీష్‌రెడ్డి ఆపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ కేకే హాజరయ్యారు. అదేవిధంగా ఎంఐఎం ఎమ్మెల్సీలు కూడా టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. బుధవారం జరిగే సమావేశంలోనే సభ్యులు కౌన్సిల్‌ ఛైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్సీలతో టీఆర్‌ఎస్‌ బలం 15కు పెరగింది. మొత్తం 40 సీట్లున్న మండలిలో ప్రస్తుతం ఐదు ఖాళీలు ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్సీ ఫారూఖ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. పిసిసి చీఫ పొన్నాల, మండలిలో నేత డిఎస్‌, షబ్బీర్‌ అలీలు వెన్నంటి రాగా ఆయన తన నామినేషన్‌ వేశారు. మండలిలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు పదిమంది సభ్యుల బలం ఉంది. టిఆర్‌ఎస్‌లో తాజాగా యాదవరెడ్డి చేరారు. కాంగ్రెస్‌ నుంచి ఐదుగురు ఎమ్మెల్సీలు ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరి చేరిక సమయంలోనే యాదవరెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం జరిగింది. సోమవారం జరిగిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సమావేశానికి మాత్రం యాదవరెడ్డి హాజరవడం విశేషం. ప్రస్తుత చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌రావు కూడా కాంగ్రెస్‌ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. ఆయన కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతారని పార్టీ వర్గాల్లో ప్రచారం ఊపందుకోవడంతో పార్టీ ముఖ్యనాయకత్వం అప్రమత్తమైంది. ఆయనను బుజ్జగించేందుకు టీ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ డి శ్రీనివాస్‌ తదితరులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మండలి చైర్మన్‌గా మరోసారి పార్టీ తరఫున అవకాశం కల్పిస్తామని కూడా వారు భరోసా ఇచ్చారని అంటున్నారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తాను మండలి చైర్మన్‌గా కొనసాగలేనని విద్యాసాగర్‌రావు తేల్చి చెప్పినట్లు తెలుస్తున్నది. దీంతో కాంగ్రెస్‌ మరో అభ్యర్థితో మండలి చైర్మన్‌ పదవికి ఫరూక్‌తో నామినేషన్‌ వేయించారని భావిస్తున్నారు. అయితే బలాబలాల దృష్ట్యా మండలి చైర్మన్‌ పదవి టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ శాసనమండలిలో 40 స్థానాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం 35మంది సభ్యులున్నారు. ఇందులో మెజార్టీ.. అంటే 18 మంది సభ్యుల బలం ఉంటే చైర్మన్‌ సీటును కైవసం చేసుకోవచ్చు. కాంగ్రెస్‌కు మొన్నటిదాకా 17 మంది సభ్యులుండగా.. వారిలో ఐదుగురు ఇటీవలే టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. వీరితో పాటు ఇద్దరు టీడీపీ, ఇద్దరు పీఆర్‌టీయూ టీచర్‌ ఎమ్మెల్సీలు కూడా టీఆర్‌ఎస్‌లోకి రావడంతో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు బలం 16కు చేరింది. కాంగ్రెస్‌కు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, నేతి విద్యాసాగర్‌రావు కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అవసరమైన మద్దతు టీఆర్‌ఎస్‌కు కనిపిస్తున్నది. ఎంఐఎంకు చెందిన ఎమ్మెల్సీలతోపాటు మరికొంత మంది ఎమ్మెల్సీలు కూడా టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో మండలి చైర్మన్‌ సీటు టీఆర్‌ఎస్‌కు ఖాయంగా దక్కనుందని అంటున్నారు. తెలంగాణ శాసనమండలిలో ఇప్పటి వరకూ మెజార్టీ పక్షంగా ఉన్న కాంగ్రెస్‌ బలం.. రోజు రోజుకు తగ్గిపోతున్నది. ఇది మరింత తగ్గి 10కు పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు మండలిలో కాంగ్రెస్‌కు మొత్తం 17 మంది సభ్యులు ఉండగా ఇటీవల ఐదుగురు ఎమ్మెల్సీలు ఆమోస్‌, జగదీశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్‌, భూపాల్‌రెడ్డి, రాజలింగం టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్‌ సంఖ్య 12కు చేరి, టీఆర్‌ఎస్‌ సంఖ్య 16కు పెరిగింది. తాజాగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైన నేపథ్యంలో కాంగ్రెస్‌ సంఖ్య 11కు పడిపోనుంది. అసంతృప్తితో ఉన్న విద్యాసాగర్‌రావు కూడా పార్టీని వీడితే కాంగ్రెస్‌ పది మందికి పరిమితం కానుంది. ప్రస్తుతం చైర్మన్‌ పదవి సొంతం చేసుకోవాలంటే 18 మంది సభ్యుల మద్దతు కావాలి. విద్యాసాగర్‌రావు మరోదఫా మండలి చైర్మన్‌గా ఉండేందుకు అనాసక్తితో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌ మైనార్టీ కార్డును ప్రయోగించాలని భావిస్తున్నది. ఈ పదవికి పార్టీ ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌ను అభ్యర్థిగా నిలిపింది. మంగళవారం ఆయన కాంగ్రెస్‌ తరఫున చైర్మన్‌ అధ్యక్ష స్థానానికి నామినేషన్‌ వేసారు. చైర్మన్‌ ఎన్నికలో టీడీపీ, మజ్లిస్‌, పీడీఎఫ్‌, టీఆర్‌ఎల్‌డీల మద్దతు కోసం కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.