రైల్వే వ్యవస్థలో ప్రైవేట్ పెట్టుబడులు అనివార్యం

ప్రాజెక్టుల పూర్తికి అవసరమైతే ఎఫ్‌డిఐ: సదానంద గౌడ
న్యూఢిల్లీ:భవిష్యత్తులో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం(పిపిపి) ద్వారా జరుగుతుందని రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ మంగళవారం ప్రకటించారు.లోక్ సభలో 2014-15 సంవత్సరానికి తన తొలి వార్షిక రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి నిధుల లేమితో నత్తనడకన సాగుతున్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పిపిపి పద్ధతి అనివార్యమని చెప్పారు. దీనికి క్యాబినెట్ లభించినట్లు ఆయన చెప్పారు. అలాగే రైల్వేలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డిఐ)ని అనుమతించడానికి క్యాబినెట్ అనుమతి కోరతానని ఆయన వెల్లడించారు. అయితే ప్రయాణికుల సర్వీసులను ఇందులో నుంచి మినహాయిస్తామని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో అధిక ప్రాజెక్టులు పిపిపి తరహాలో ఉంటాయని ఆయన చెప్పారు.ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్దదైన భారతీయ రైల్వేలు తక్కువ పెట్టుబడి, జనాకర్షక విధానాలు, సబ్సిడీ ఛార్జీల కారణంగా తీవ్రంగా నష్టపోయిందని ఆయన చెప్పారు. దీంతో రైల్వేల ఆర్థిక ప్రగతి పూర్తిగా కుంటుపడిందని ఆయన అన్నారు.దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి జనాకర్షక నిర్ణయాలకు స్వస్తి చెప్పాలన్న ప్రధాని నరేంద్ర మోడి విధానాలనే తాము కూడా పాటిస్తామన్న సంకేతాలను అందచేస్తూ ప్రైవేట్ పెట్టుబడుల స్వీకరణ ద్వారానే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాగలదని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు.