పోలవరంను అడ్డుకుంటాం
– ప్రజలను ముంచి ప్రాజెక్టులు కడతారా?
– ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలి
– టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం
హైదరాబాద్, జులై10 (జనంసాక్షి):
పోలవరం ముంపు మండలాలు తెలంగాణలోనే ఉండాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షల మేరకే రాష్టాల్ర సరిహద్దులు ఉండాలని కోరారు. గతంలో సరిహద్దు వివాదాలు వచ్చినా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని గుర్తు చేశారు. అసంబద్ధంగా సరిహద్దులు నిర్ణయించిన చోట సమస్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. స్థానిక ప్రజలు తెలంగాణలోనే ఉంటామని అంటున్నారని చెప్పారు. ప్రజలను ముంచి ప్రాజెక్టులు కడతారా అని ప్రశ్నించారు. లోతైన ఆలోచనతోనే పోలవరాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆదివాసులను ముంచే పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటామని చెప్పారు. ముంపు మండలాల్లో ప్రజాభిప్రాయసేకరణ సరిగా జరగలేదని ఆరోపించారు. పోలవరం కట్టవద్దని తాము అనడం లేదన్నారు. ముంపునకు అవకాశం లేకుండా డిజైన్ మార్చి పోలవరం నిర్మించుకోవచ్చన్నారు. దీనికి సర్వసమ్మతం ఉన్నా కూడా ముంచైనా ప్రాజెక్ట్ నిర్మిస్తామనడం మూర్ఖపు వాదనని మండిపడ్డారు. గిరిజనుల మీద జరుతున్న ఈ దాడిని సహించబోమన్నారు. దీనిని వ్యతిరేకిస్తూనే ఉంటామన్నారు. ఇదిలావుంటే నగరంలోని ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ జేఏసీ నేతలు గురువారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరంపై బీజేపీ నేత అశోక్‌కుమార్ ప్రసంగాన్ని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. పోలవరం ఆర్డినెన్స్ విషయంలో బీజేపీ కొత్తగా చేసిందేమీ లేదని, తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంతో సంప్రదించడం లేదని అశోక్‌కుమార్ ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన తెలంగాణవాదులు అశోక్‌కుమార్ ప్రసంగాన్ని అడ్డుకుని బీజేపీ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు.